Telugu Global
Telangana

పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా..? జైలు ఖాయం జాగ్రత్త

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా బండి నడిపిన మైనర్‌ ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 144 మంది మైనర్లపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 91 మందిని జువైనల్‌ హోమ్‌ కి తరలించారు.

పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా..? జైలు ఖాయం జాగ్రత్త
X

మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులారా బహుపరాక్. పొరపాటున మీవాడు బండి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కాడా..? ఇంటికి తిరిగి రాడు, నేరుగా జువైనల్ హోమ్ కి పోతాడు జాగ్రత్త. ఆ తర్వాత మీరు కూడా ఊచలు లెక్కబెట్టే ప్రమాదం ఉంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇప్పటికే ఇలా 144మంది మైనర్లపై కేసులు పెట్టి వారిలో 91మందిని జువైనల్ హోమ్ కి తరలించారు వరంగల్ పోలీసులు. రోడ్డుమీద మైనర్లు బండితో కనపడితే వెంటనే పట్టుకుంటున్నారు.

మావాడు సెవన్త్ క్లాస్, అప్పుడే బైక్ నడుపుతాడు తెలుసా..? ఓ తండ్రి గర్వంగా చెప్పుకునే మాట ఇది.

మా పాప నైన్త్ క్లాస్, నన్ను ఆఫీస్ దగ్గర స్కూటీపై డ్రాప్ చేస్తుంది.. ఓ తల్లి సంతోషం..

పిల్లలు వయసుకి మించి ఎదిగిపోతున్నారని, పెద్ద పెద్ద బండ్లు నడిపేస్తున్నారని సంతోషపడుతుంటారు తల్లిదండ్రులు. కానీ మైనర్లకు వాహనాలివ్వడం చట్టరీత్యా నేరం. వారు ఎంత బాగా నేర్చుకున్నా.. వారి వయసు, పరిణితి వాహనాలు నడపడానికి సరిపోవు అని మోటార్ వెహికల్ యాక్ట్ చెబుతోంది. పైగా రోడ్డు ప్రమాదాల్లో 20శాతం మైనర్ల వల్లే జరుగుతున్నాయనే గణాంకాలు కూడా పిల్లలకు వాహనాలివ్వడం ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెబుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు వరంగల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

మైనర్లు పట్టుబడితే..

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా బండి నడిపిన మైనర్‌ ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 144 మంది మైనర్లపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 91 మందిని అరెస్ట్‌ చేసి జువైనల్‌ హోమ్‌ కి తరలించారు. మరో 53 మందిని జువైనల్‌ హోమ్‌ కి తరలించబోతున్నారు. వేసవి సెలవుల్లో మైనర్లు వాహనాలు నేర్చుకోవాలని ఉబలాటపడతారు. పూర్తిగా నేర్చుకోకముందే రయ్ రయ్ మంటూ రోడ్డెక్కేస్తారు. పిల్లల ఒత్తిడికి లోనై వాహనాలను వారి చేతికిస్తే వారి భవిష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

First Published:  27 April 2023 9:24 AM IST
Next Story