Telugu Global
Telangana

పాపం కడియం.. ఈసారి ఏమైందంటే..!

కొండా సురేఖ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కొండా అనుచరులు ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు గొడవకి దిగారు. దీంతో గజ్జి విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆయనను విడుదల చేయాలని అనుచరులు రాస్తారోకో చేశారు.

పాపం కడియం.. ఈసారి ఏమైందంటే..!
X

ఏ ముహూర్తాన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారో గానీ.. ఆ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. కడియం ముందే ఫైటింగులకు దిగుతుంటే.. చేసేదేం లేక ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్‌ కాంగ్రెస్‌లో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ ఎంపీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు షాక్ తప్పదనే చర్చ జోరందుకుంది.

తాజాగా పరకాల మండలం కామారెడ్డిపల్లిలో రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ లోక్‌సభ సన్నాహక సమావేశం జరిగింది. మీటింగ్‌లో కడియం శ్రీహరి, కావ్యతో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొండా సురేఖ అనుచరులు వీళ్ల ముందే గళ్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎన్నికల సన్నాహక సమావేశం అర్థాంతరంగా ముగిసింది.

కొండా సురేఖ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కొండా అనుచరులు ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు గొడవకి దిగారు. దీంతో గజ్జి విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆయనను విడుదల చేయాలని అనుచరులు రాస్తారోకో చేశారు. గజ్జి విష్ణుతో పాటు ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ ప్రకటించారు.

కాంగ్రెస్‌లో కడియం శ్రీహరి చేరాక వరంగల్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులొచ్చాయి. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ ఎంట్రీని కొంతమంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానం చొరవతో ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయి. ఇక అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో రోజుకో వివాదం జరుగుతోంది. మొన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన మీటింగ్‌లోనూ కాంగ్రెస్‌నేతలు రెండు గ్రూపులుగా మారి ఘర్షణకు దిగారు. దీంతో కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కావ్య మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోయారు.

First Published:  15 April 2024 12:21 PM IST
Next Story