Telugu Global
Telangana

అసెంబ్లీలో నల్గొండ పగ.. - జగదీశ్‌రెడ్డి వర్సెస్‌ కోమటిరెడ్డి బ్రదర్స్

జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో హీట్ పుట్టించాయి. "స్వార్థం కోసం పార్టీ మారింది నువ్వు, బీజేపీకి ఓటేయాలంది మీ అన్న". మీలాంటి పనికిమాలినొళ్లా నన్ను అనేది అంటూ కౌంటరిచ్చారు.

అసెంబ్లీలో నల్గొండ పగ.. - జగదీశ్‌రెడ్డి వర్సెస్‌ కోమటిరెడ్డి బ్రదర్స్
X

నల్గొండ పొలిటికల్‌ రివేంజ్‌కు అసెంబ్లీ వేదికైంది. మాజీమంత్రి జగదీశ్‌రెడ్డికి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ జోక్యం చేసుకుని అభ్యంతరకర పదాలను రికార్డ్స్‌ నుంచి తొలగిస్తామనే వరకు పరిస్థితి వెళ్లింది. విద్యుత్‌రంగంపై చర్చ సమయంలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులనే బూచీగా చూపెడుతున్నరని మండిపడ్డారు. 81వేల కోట్ల అప్పులని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. విద్యుత్ రంగ ఆస్తుల్ని లక్షా 50వేల కోట్లకు పెంచిన విషయాన్ని కూడా గుర్తిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. "అప్పులు అందరికీ ఉంటాయి. నాకున్నాయి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి కూడా ఉన్నాయి. అలా అని మేం బ్యాడ్ ఫాదర్స్‌మి కాదు కదా. మా పిల్లల భవిష్యత్తును పాడు చేయాలని అప్పులు చేసినట్లా" అంటూ జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మైక్ అందుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. జగదీశ్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. "నువ్వో పవర్‌లేని పవర్ మినిస్టర్‌వు. యాదాద్రి ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్‌వు. 10వేల కోట్లు తిన్నవ్. మొత్తం కక్కిస్తా. జ్యూడిషియల్ ఎంక్వైరీలో అన్నీ బయటపడుతాయి. నిన్ను జైలుకు పంపుతం". అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా BRS ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో హీట్ పుట్టించాయి. "స్వార్థం కోసం పార్టీ మారింది నువ్వు, బీజేపీకి ఓటేయాలంది మీ అన్న". మీలాంటి పనికిమాలినొళ్లా నన్ను అనేది అంటూ కౌంటరిచ్చారు. జగదీశ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజగోపాల్‌రెడ్డి ఖబర్దార్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు భరించాం, ఇక ఎవర్నీ వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. ఇలా నల్గొండ నేతల మధ్య జరిగిన డైలాగ్ వార్ అసెంబ్లీలో హీట్ పుట్టించింది.

First Published:  21 Dec 2023 4:17 PM IST
Next Story