డీఎస్ కుటుంబంలో వార్.. నాన్నను తమ్ముడు అరవింద్ చంపేస్తాడేమో అని సంజయ్ అనుమానాలు!
తండ్రితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్.. ఇదంతా తమ్ముడు అరవింద్ కుట్రగా అభివర్ణించారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో కేసీఆర్‌కు సన్నిహితంగా మెలిగిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుటుంబంలో సినిమాను మించిపోయిన డ్రామా నడుస్తున్నట్లు కనపడుతోంది. డీఎస్ ఉమ్మడి ఏపీలో పీసీసీ ప్రెసిడెంట్‌గా పని చేశారు. వైఎస్ఆర్ క్యాబినెట్‌లో మినిస్టర్ కూడా అయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆయనను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా సముచిత స్థానం ఇచ్చారు. డీఎస్.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఆయన చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీలో జాయిన్ అయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మీద అరవింద్ ఎన్నో సార్లు అవాకులు చవాకులు పేలారు. ఆనాడు కూడా డీఎస్ చిన్న కుమారుడిని చిన్నగా కూడా మందలించలేదు.
ఇక తాజాగా రెండు రోజుల నుంచి డీఎస్ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ధర్మపురి శ్రీనివాస్ ఆదివారం గాంధీభవన్‌కు చక్రాల కుర్చీలో వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ టీపీసీసీ అధికారికంగా కూడా ప్రకటించింది. పెద్ద కొడుకు సంజయ్‌తో కలసి ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారని మీడియాలో కూడా ప్రచారం జరిగింది. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై జరిగిన నిరసన దీక్షలో కూడా ఆయన పాల్గొన్నారని పేర్కొన్నది. కానీ, రాత్రికి రాత్రే ఏమైందో కానీ.. డీఎస్ భార్య విజయలక్ష్మి ఒక లేఖ విడుదల చేశారు. నా భర్తను కాంగ్రెస్‌లో చేర్చుకునే పద్దతి ఇది కాదంటూ.. ఇకపై మా ఇంటివైపు కాంగ్రెస్ నేతలు రావొద్దండూ సీరియస్‌గా లేఖలో పేర్కొన్నారు.
అయితే... ఈ లేఖ విడుదల అయిన తర్వాత డీఎస్ కుటుంబంలోని లుకలుకలు బయటపడ్డాయి. నిన్న తండ్రితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్.. ఇదంతా తమ్ముడు అరవింద్ కుట్రగా అభివర్ణించారు. తండ్రి డీఎస్ ఎంతో సంతోషంగా మీడియా, పార్టీ పెద్దల సాక్షిగా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని... కానీ తమ్ముడు అరవింద్ కుట్ర చేశారని ఆయన అన్నారు. తన తల్లి రాజీనామా లేఖ విడుదల చేయడం వెనుక అరవింద్ ఉన్నాడని అన్నారు. తన తండ్రికి అరవింద్ నుంచి ప్రాణ హాని ఉందని సంజయ్ చెప్పారు. ఏదో ఒక రోజు తమ్ముడు.. తండ్రిని చంపేస్తాడని చెప్పారు.
ఇన్నాళ్లూ ఎలాంటి ఆందోళన లేకుండా బతికిన ధర్మపురి శ్రీనివాస్‌కు కొడుకుల రాజకీయ పోరు తలనొప్పి తెచ్చి పెడుతోందని సన్నిహితులు అంటున్నారు. డీఎస్ గత కొన్ని రోజులుగా కుటుంబ రాజకీయాల మధ్య నలిగిపోతున్నారని చెబుతున్నారు. నిన్న డీఎస్ స్వయంగా పార్టీలో చేరిన తర్వాత కూడా ఇలా జరగడం చూస్తుంటే.. అరవింద్ ఏదో చేస్తున్నాడనే అనుమానాలు కలుగుతున్నాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు ఎవరికీ తెలియని డీఎస్ కుటుంబ వ్యవహారాలు ఒక్క సారిగా మీడియాకు ఎక్కడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది.