మావోయిస్టులకు ఎదురు దెబ్బ.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్ రావు అరెస్టు
తెలంగాణ పోలీస్‌తో పాటు ఎన్ఐఏ వాంటెడ్ లిస్టులో ఉన్న సంజయ్ దీపక్ రావు మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి శివగంధనగర్ నివాసి.
సీపీఐ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమ కనుమల్లో పార్టీని నడిపిస్తున్న నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక పని నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దీపక్ రావును కూకట్‌పల్లిలోని మలేషియన్ టౌన్‌షిప్ వద్ద పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇక ఆయన భార్య, వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు సరస్వతిని ఏపీలోని సత్యసాయి జిల్లా కొత్తచెరువులో అరెస్టు చేశారు. ఈ మేరకు వారి అరెస్టును శుక్రవారం మీడియా ముందు వెల్లడించారు.
తెలంగాణ పోలీస్‌తో పాటు ఎన్ఐఏ వాంటెడ్ లిస్టులో ఉన్న సంజయ్ దీపక్ రావు మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి శివగంధనగర్ నివాసి. కేరళ, తమిళనాడు, కర్ణాటక ట్రై జంక్షన్‌తో పాటు వెస్ట్రన్ ఘాట్స్‌లో మావోయిస్టు పార్టీ కోసం ఆయన కీలకంగా పని చేస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన దీపక్ రావు చికిత్స నిమిత్తం పట్టణ ప్రాంతానికి వచ్చారు. చికిత్స అనంతరం దండకారణ్యంలో పార్టీ అగ్రనేతలను కలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చారు.
మలేషియా టౌన్‌షిప్‌లో నివశిస్తున్న ప్రొఫెసర్ రంజిత్ శంకర్‌తో పాటు ఫిల్మ్ ఎడిటర్ అజిత్ కుమార్‌ను కలిసేందుకు నగరానికి చేరుకున్నారు. అయితే నాలుగేళ్లుగా దీపక్ రావుపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి కీలకంగా భావిస్తున్న వెస్ట్రన్ ఘాట్స్‌లో దీపక్ రావే నాయకుడిగా ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగానే వెస్ట్రన్ ఘాట్స్ నుంచి దీపక్ రావు బయటకు వచ్చినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్న దీపక్ రావు కదలికల గురించి పోలీసులకు తెలియడంతో అరెస్టు చేశారు. 2007లో దీపక్ రావుకు ఏపీలోని అనంతపురానికి చెందిన మావోయిస్టు నేత సరస్వతితో వివాహం జరిగింది.
థానేకు చెందిన దీపక్ రావు 1983లో జమ్ము కశ్మీర్‌లో బీటెక్ చదివారు. ఆ సమయంలో కశ్మీర్ వేర్పాటు వాదానికి మద్దతు ఇచ్చే స్నేహితులతో పరిచయం అయ్యింది. దీపక్ రావు కూడా కశ్మీర్ వేర్పాటు వాదానికి తన మద్దతు తెలియజేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీపీఐ ఎంఎల్, సెంట్రల్ రీ ఆర్గనైజేషన కమిటీ గ్రూప్, సీపీఐ ఎంఎల్ రవూఫ్ గ్రూప్‌లో పని చేశారు. ఇక 1999లో కొనాత్ మురళీధరన్ అలియాస్ అజిత్‌తో కలిసి సీపీఐ ఎంఎల్ నక్సల్‌బరీ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌కు మహారాష్ట్ర ఇంచార్జిగా దీపక్ రావు వ్యవహరించగా.. ఆల్ ఇండియా సెక్రటరీగా మురళీధరన్ ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఈ గ్రూప్‌ను మావోయిస్టు పార్టీలో విలీనం చేశారు.