Waltair Veerayya: వాల్తేరు వీరయ్య విజయోత్సవంలో రచ్చ.. పోలీసుల లాఠీ చార్జ్
Waltair Veerayya Success Meet: తొక్కిసలాటలో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ లో నిర్వహిస్తేనే జనాలను అదుపు చేయడం కష్టం. అలాంటిది హన్మకొండ లాంటి పట్టణంలో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ పెట్టడం, అందులోనూ చిరంజీవి, రామ్ చరణ్ రావడంతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ అభిమానులతో కిక్కిరిసింది. శృతిహాసన్, రవితేజ కూడా వస్తారని ప్రచారం చేసినా వారు రాలేకపోయారు. చిరు, రామ్ చరణ్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు.
కార్యక్రమం ప్రారంభం కాకముందే తమకు పాసులు కావాలంటూ ఆర్స్ట్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు నిరసనకు దిగారు. చివరకు నిర్వాహకులు వారిని సముదాయించారు. ఆ తర్వాత కాలేజీ గ్రౌండ్ లోకి ప్రేక్షకులను అనుమతించే క్రమంలో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోయారు. బ్యానర్లు చించుకుంటూ, కటౌట్లు విరగ్గొట్టుకుని మహిళలు కాంపౌండ్ గోడలు దూకి కూడా లోపలికి వెళ్లారు. తొక్కిసలాటలో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ ని హనుమకొండలో ప్లాన్ చేసిన తర్వాత నిర్వాహకులు భారీగా ప్రచారం చేపట్టారు. హీరో హీరోయిన్లు, రవితేజ, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అంటూ హడావిడి చేశారు. దీంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కోసం తరలి వచ్చారు. చివరకు రవితేజ, శృతి హాసన్, దేవిశ్రీ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. చిరంజీవి, రామ్ చరణ్ సహా చిత్ర యూనిట్ అంతా వచ్చారు. జ్ఞాపికల ప్రదానోత్సవం సందడిగా సాగింది. అయితే చాలామంది ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చి నిరాశతో వెనుదిరిగారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చినవారు సైతం సరైన వసతి లేక వెళ్లిపోయారు.