నగరవాసులూ.. నవంబర్ 30 మర్చిపోవద్దు
సగం మంది కూడా ఓటేయకపోతే ప్రజాభిప్రాయం ఎలా ప్రతిఫలిస్తుంది.. మేం ఒక్కళ్లం ఓటేయకపోతే ఎలా అని ఎవరికి వారు అనుకుంటే ఎలా అంటూ ఆలోచింపజేస్తూ స్వచ్ఛంద సంస్థలు ముందుకెళుతున్నాయి.
అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ఎన్నికలంటే పండగే. పోలింగ్ రోజున పొద్దున్నే హడావిడిగా ఓట్ల పండగకు జనం బయలుదేరతారు. కానీ, అదంతా పల్లెలు, పట్టణాల ముచ్చట. నగరవాసులకు ముఖ్యంగా హైదరాబాద్ నగర ఓటర్లకు మాత్రం ఎలక్షన్ అంటే ఓ ఎక్స్‌ట్రా హాలీ డే అంతే. ఓటేయడానికి రాకుండా ఇంట్లోనే సేదతీరుతుంటారని గత ఎన్నికల పోలింగ్ శాతం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అందుకే ఈసారి వారిని పోలింగ్ బూత్‌కు రప్పించడానికి అభ్యర్థులు, ఎన్నికల అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో పాటు మీడియా కూడా ప్రయత్నిస్తుంది.
సగం మంది కూడా ఓటేయనివి 9 నియోజకవర్గాలు
హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న ఓటర్లలో సగం మంది కూడా ఓటేయని నియోజకవర్గాలు చాలా ఉంటుంటాయి. గత ఎన్నికల్లో 50 శాతం కూడా ఓట్లు పోలవని ఇలాంటి నియోజకవర్గాలు 9 ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్‌లో 40 శాతమే ఓట్లు పోలయ్యాయి. యాకుత్‌పురాలో 41.24, మలక్‌పేటలో 42.74, నాంపల్లిలో 44.02, జూబ్లీహిల్స్‌లో 45.61, చాంద్రాయణగుట్టలో 46.11, శేరిలింగంపల్లిలో 48.51, కంటోన్మెంట్‌లో 49.05, ఎల్బీనగర్‌లో 49.33 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
వీటిలో 60 శాతం లోపే..
ఇక బహుదూర్‌పురా, ముషీరాబాద్, ఉప్పల్, కార్వాన్, సనత్‌నగర్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, మహేశ్వరం, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, అంబర్‌పేట, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, గోషామహల్ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ శాతం 60 లోపే. నగరవాసులకు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉన్న నిరాసక్తతకు ఈ గణాంకాలే సాక్ష్యం.
ఈసారి పెంచాలని ప్రయత్నం
అందుకే ఈసారి పోలింగ్ శాతం పెంచాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సగం మంది కూడా ఓటేయకపోతే ప్రజాభిప్రాయం ఎలా ప్రతిఫలిస్తుంది.. మేం ఒక్కళ్లం ఓటేయకపోతే ఎలా అని ఎవరికి వారు అనుకుంటే ఎలా అంటూ ఆలోచింపజేస్తూ స్వచ్ఛంద సంస్థలు ముందుకెళుతున్నాయి. ఓ ఆంగ్ల మీడియా సంస్థ నవంబర్ 30 మర్చిపోవద్దంటూ వాహనాలకు పోస్టర్లు కట్టి వినూత్నంగా ప్రచారం చేస్తోంది.