Telugu Global
Telangana

బ్యాంక్ లావాదేవీలపై ఈసీ నిఘా.. రూ.8 కోట్లు ఫ్రీజ్

రూ. 8కోట్ల నగదు బదిలీపై విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందిని ఈసీ వివరణ కోరింది. ఆ వివరణ సరైనది అయితే లావేదేవీని పూర్తి చేస్తారు. అప్పటి వరకు ఆ నగదు ఫ్రీజ్ చేసి ఉంచేలా ఈసీ ఆదేశాలిచ్చింది.

బ్యాంక్ లావాదేవీలపై ఈసీ నిఘా.. రూ.8కోట్లు ఫ్రీజ్
X

తెలంగాణలో ఎన్నికల వేళ నగదు లావాదేవీలపై ఈసీ నిఘా పెట్టింది. డబ్బు ఒకచోటు నుంచి ఇంకో చోటుకు తరలిస్తుంటే చెక్ పోస్ట్ ల వద్ద దొరికిపోతామనే అనుమానంతో కొంతమంది తెలివిగా బ్యాంకు ట్రాన్స్ ఫర్లు చేస్తున్నారు. వ్యాపారాల్లో ఉన్న రాజకీయ నాయకులకు ఈ పని మరింత సులువు. కంపెనీ సొమ్ము అని చెప్పి ఎంత పెద్ద మొత్తమైనా ట్రాన్స్ ఫర్ చేసేయొచ్చు. ఇలా కంపెనీ సొమ్ము ట్రాన్స్ ఫర్ చేసినట్టు కనికట్టు చేయబోయిన కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి పోలీసులకు దొరికిపోయారు. ఆయన సంస్థకు చెందిన రూ.8 కోట్ల సొమ్ముని.. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు.

ఈ నెల 13న జరిగిన లావాదేవీ వ్యవహారంపై ఈసీ నిఘా పెట్టడంతో అసలు వ్యవహారం బయటపడింది. ఈనెల 13న బేగంపేటలోని HDFC బ్రాంచ్‌ లోని విశాఖ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు చెందిన ఒక ఖాతా నుంచి బషీర్‌ బాగ్‌ లోని IDBI బ్యాంకు శాఖలోని విజిలెన్స్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాలోకి రూ.8 కోట్ల నగదు బదిలీ అయింది. ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ఈసీ కన్నేసింది. దీంతో ఈ లావాదేవీ గురించి బ్యాంక్ అధికారులు ఈసీకి సమాచారమిచ్చారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కి చెందిన కంపెనీనుంచి సొమ్ము బదిలీ కావడంతో ఈసీ ఈ విషయంపై సీరియస్ గా దృష్టిపెట్టింది. ఈసీ ఆదేశాల మేరకు బ్యాంక్ అధికారులు రూ.8కోట్లను ఫ్రీజ్ చేశారు.

రూ. 8 కోట్ల నగదు బదిలీపై విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందిని వివరణ కోరింది ఈసీ. ఆ వివరణ సరైనది అయితే లావేదేవీని పూర్తిచేస్తారు. అప్పటి వరకు ఆ నగదు ఫ్రీజ్ చేసి ఉంచేలా ఈసీ ఆదేశాలిచ్చింది. సైఫాబాద్‌ పోలీసులు కూడా దీనిపై విచారణ చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి చెన్నూరులో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీలు మారి టికెట్ కొనుగోలు చేసినట్టే, ఓట్లు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారని మండిపడుతున్నారు.

*

First Published:  20 Nov 2023 10:32 AM IST
Next Story