Telugu Global
Telangana

హైదరాబాద్ లో గతంలోకన్నాపెరిగిన వైరల్ ఇన్ఫెక్షన్లు... జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన‌

Viral Infections in Hyderabad: హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు, క్లినిక్ లకు పొడి దగ్గు, శరీర నొప్పులు,జ్వరాలతో పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు.ఇందులో కొంతమందిని అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది.

Viral Infections in Hyderabad
X

హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో చలి హెచ్చుతగ్గుల కారణంగా వైరల్ జ్వరాల కేసులు గణనీయంగా పెరిగాయి.

ప్రమాదకరమైనవి కానప్పటికీ, ఈ ఇన్‌ఫెక్షన్‌లు చాలా అనారోగ్యాలకు కారణమవుతాయి, రోగులు కోలుకోవడానికి కనీసం ఒక వారం సమయం పడుతుంది. ఒక్కో సారి అంతకన్నా ఎక్కువ కూడా పట్టవచ్చు.

హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు, క్లినిక్ లకు పొడి దగ్గు, శరీర నొప్పులు,జ్వరాలతో పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు.ఇందులో కొంతమందిని అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. .

ఇప్పుడు వస్తున్న మెజారిటీ రోగులకు కరోనా లక్షణాలుంటున్నాయి కాని కరోనా ఉండటం లేదు.

హైదరాబాద్‌లో పొడి చలి వాతావరణం ఫిబ్రవరి చివరి వరకు ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి బారిన పడకుండా ఉండాలని, వ్యాధి వస్తే కనీసం ఒక వారం పాటు రెస్ట్ తీసుకోవాలని సీజనల్ వ్యాధుల నిపుణులు ప్రజలను కోరారు. ఆసక్తికరంగా, ఈ సంవత్సరం, పెద్ద సంఖ్యలో రోగులకు దగ్గు చాలా ఎక్కువగా ఉందని, ఒక వారం పాటు మందులు వాడిన‌ తర్వాత కూడా తగ్గడం లేదని వైద్యులు చెప్తున్నారు.

“మేము రోజూ అటువంటి వందల మంది రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్నాము. కానీ, ఇవి సీజనల్ ఇన్‌ఫెక్షన్లని, ప్రాణాంతకం కాదని ప్రజలు గుర్తుంచుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అనారోగ్య పరిస్థితులతో ఉండే వృద్ధులతో సహా హై రిస్క్ గ్రూపులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారికి ఈ వైరల్ ఫీవర్ సోకినట్లయితే, కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, ”అని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ చెప్పారు.

ప్రతిసారికన్నా ఈ శీతాకాలంలో, పిల్లలు, పెద్దలలో, ఫ్లూ,ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ముక్కుపై ప్రభావం చూపడం, దగ్గు, జ్వరం లేదా న్యుమోనియాతో ఎగువ శ్వాసనాళాల వాపులు గణనీయంగా పెరిగాయి.

వైరల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా, ఆస్తమా, చల్లని, పొడి వాతావరణానికి అలెర్జీ పెరిగాయి. శీతాకాలంలో శ్వాస తీసుకోవడం మరింత కష్టతరం అవుతుంది. దాని దీర్ఘకాలిక స్వభావం కారణంగా, ఆస్తమాకు దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. ఉబ్బసం ఉన్నవారు ఇన్హేలర్లు తప్పకుండా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

First Published:  31 Jan 2023 6:02 AM IST
Next Story