Telugu Global
Telangana

హైదరాబాద్ లో రేపే నిమజ్జనం.. ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకు మొత్తం 19 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు జరుగుతుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు.

హైదరాబాద్ లో రేపే నిమజ్జనం.. ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్
X

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం రేపు ఘనంగా మొదలవుతుంది. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఊరేగింపులు మొదలవుతాయి. ఖైరతాబాద్ మహాగణపతి హుస్సేన్ సాగర్ ఒడికి చేరిన తర్వాత నిమజ్జన ఘట్టం పూర్తయినట్టుగా భావిస్తారు. నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించారు పోలీస్ అధికారులు. బాలాపూర్ నుంచి నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే ప్రధాన శోభాయాత్రతో పాటు.. ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు నగరంలోకి అనుమతి లేదు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్‌ఆర్‌ తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.

ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్..

వినాయక విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు పోలీసులు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్‌ కేటాయించారు. వాటికి జియో ట్యాగింగ్‌ చేశారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్‌ చేశారు. వీటి వివరాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తో అనుసంధానించారు. ఈ క్యూఆర్‌ కోడ్స్, జియో ట్యాగింగ్‌ డేటాను పోలీసుల అధికారిక యాప్‌ 'టీఎస్‌ కాప్‌'లోకి లింకు ఇచ్చారు. అంటే నిమజ్జనం రోజు ఏ విగ్రహం, ఏ రోడ్డులో రావాలి, ఏ సమయానికి ట్యాంక్ బండ్ చేరాలి అనేవన్నీ సెల్ ఫోన్ లోనే సిబ్బంది చూసేయొచ్చు.

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకు మొత్తం 19 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు జరుగుతుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, 3 కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ అందుబాటులో ఉంటాయి. హుస్సేన్‌ సాగర్‌ దగ్గరే కాకుండా 18 కీలక జంక్షన్లలో కూడా పోలీస్ బలగాలు మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని కవర్‌ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాంటీ చైన్‌ స్నాచింగ్, షీ–టీమ్స్‌ బృందాలతో పాటు డాగ్‌ స్క్వాడ్ లను రంగంలోకి దింపుతున్నారు.

రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్‌ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాచకొండ పరిధిలో 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి పిలిపించారు. అటు ఆర్టీసీ కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్‌ సర్వీసులు అదనంగా నడుస్తాయి.

First Published:  27 Sept 2023 7:39 PM IST
Next Story