Telugu Global
Telangana

హైదరాబాద్ లో నిమజ్జనం కోసం 72 తాత్కాలిక చెరువులు..

బేబీ పాండ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనే విషయంపై GHMC అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయా ప్రాంతాలకు సమీపంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసినవారు కృత్రిమ చెరువుల వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు అధికారులు.

హైదరాబాద్ లో నిమజ్జనం కోసం 72 తాత్కాలిక చెరువులు..
X

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనంతో సహజసిద్ధమైన చెరువులు కలుషితం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం 72 ప్రదేశాలలో పోర్టబుల్ నీటి కుంటలు, తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేస్తోంది. కృత్రిమంగా తయారు చేసిన ఈ నీటి కుంటల్లో చిన్నవాటి నుంచి మీడియం సైజు విగ్రహాల వరకు నిమజ్జనం చేయొచ్చు. ఆ తర్వాత వాటిని GHMC సిబ్బంది అక్కడి నుంచి తరలిస్తారు.

పర్యావరణ పరిరక్షణ కోసం..

మట్టి విగ్రహాలను ఏ చెరువులో నిమజ్జనం చేసినా ఎవరికీ సమస్య ఉండదు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తేనే సమస్య మొదలవుతుంది. ఆ విగ్రహాల తయారీలో ఉపయోగించిన కృత్రిమ రంగులు, ఇతర పదార్థాలు, ఇనుము చెరువులను కలుషితం చేస్తుంది. జలచరాలకు హాని చేస్తుంది. దీంతో నీటిని కలుషితం చేయకుండా కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గతేడాది కూడా ఇలాంటి తాత్కాలిక చెరువులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 72 బేబీ పాండ్స్ రెడీ చేశారు అధికారులు.

బేబీ పాండ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనే విషయంపై GHMC అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయా ప్రాంతాలకు సమీపంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసినవారు కృత్రిమ చెరువుల వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు అధికారులు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌ మెంట్ అథారిటీ (HMDA), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)తో సహా వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన సమయంలో విగ్రహాలను తొలగించేందుకు మూడు షిఫ్టుల్లో 10,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తారని తెలిపారు అధికారులు.


First Published:  21 Sept 2023 5:26 PM IST
Next Story