రాజయ్యకు బుజ్జగింపులు
వినయ్ భాస్కర్ తో భేటీ తర్వాత రాజయ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రాకపోవడం బాధగా ఉన్నా అందరి మద్దతు పొందుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిన్న కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహను కలసి కలకలం రేపారు. వారిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని అంటున్నా.. రాజయ్యకు రాజనర్సింహ ఆఫర్ ఇచ్చారని మాత్రం తెలుస్తోంది. అయితే ఇంతలోనే రాజయ్య వద్దకు బీఆర్ఎస్ దూతగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వచ్చారు. వీరిద్దరి భేటీ ఈరోజు టాక్ ఆఫ్ వరంగల్ గా మారింది.
బుజ్జగింపులకోసమేనా..?
స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు ఈసారి టికెట్ దక్కలేదు. అక్కడ కడియం శ్రీహరికి ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. టికెట్ దక్కకపోవడంతో కన్నీటి పర్యంతం అయిన రాజయ్య, ఆ తర్వాత సర్దుకుపోయారు. తాను సీఎం కేసీఆర్ వెంటే ఉంటానన్నారు. రోజులు గడిచేకొద్దీ ఆయన మాటలు, చేతల్లో మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహను కలసిన తర్వాత బీఆర్ఎస్ కూడా రాజయ్యపై ఫోకస్ పెంచింది. ఆయన్ను వినయ్ భాస్కర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజయ్యను బుజ్జగించేందుకే కలిశారా అన్న ప్రశ్నకు మాత్రం వినయ్ భాస్కర్ సమాధానం దాటవేశారు. ఇది సాధారణ భేటీయే తప్ప దీనికి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు.
రాజయ్య వైరాగ్యం..
వినయ్ భాస్కర్ తో భేటీ తర్వాత రాజయ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రాకపోవడం బాధగా ఉన్నా అందరి మద్దతు పొందుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. టికెట్ దక్కకపోవడంతో వస్తున్న పరామర్శలను ఆస్వాదిస్తున్నట్టు తెలిపారు రాజయ్య.