వీఆర్వోల సర్దుబాటుకు తెలంగాణ హైకోర్టు అడ్డు
విచారణ చేపట్టిన హైకోర్టు.. నిబంధనలు ఎందుకు రూపొందించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం లేకపోవడంతో జీవో 121 అమలుని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది హైకోర్టు.
దాదాపు రెండేళ్లుగా విధులకు దూరంగా ఉన్న వీఆర్వోలను ఎట్టకేలకు ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా.. హైకోర్టు మాత్రం సర్దుబాటు జీవోలోని అంశాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ అడ్డుకుంది. నిబంధనలు రూపొందించకుండా జీవో 121 ద్వారా బదలాయింపు సరికాదని చెప్పింది. జీవో ప్రకారం ఇప్పటివరకు వేరే శాఖలలోకి వెళ్లనివారిని రెవెన్యూ శాఖలోనే కొనసాగనివ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలుపై స్టే విధించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది.
రెవెన్యూలో అక్రమాలు, అవినీతిని అడ్డుకునేందుకు వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం 2020లో ఓ చట్టం చేసింది. దాని ప్రకారం వీఆర్వోలు, వీఆర్ఏలకు పనిలేకుండా పోయింది. వారంతా రెండేళ్లుగా జీతాలు తీసుకుంటూ అదే శాఖలో ఇతర పనులు చేస్తున్నారు. తమకు పూర్తిస్థాయిలో విధులు అప్పగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. జీవో 121ను సవాలు చేస్తూ తెలంగాణ వీఆర్వో సంఘం అధ్యక్షులు హైకోర్టుని ఆశ్రయించారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినా నిబంధనలు రూపొందించలేదని అన్నారు. వీఆర్వోలను తమకు అనుభవం ఉన్న రెవెన్యూ శాఖలో ఉంచకుండా ఇతర శాఖలకు బదిలీ చేయడం సరికాదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిబంధనలు ఎందుకు రూపొందించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం లేకపోవడంతో జీవో 121 అమలుని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది హైకోర్టు.
తెలంగాణలో 5 వేలకుపైగా ఉన్న వీఆర్వోల్లో 98.9 శాతం మంది ఇతర శాఖలకు వెళ్లిపోగా కేవలం 56 మంది మాత్రం మొండికేస్తున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. వారంతా రెవెన్యూ శాఖలోనే ఉంటామని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని, కొత్త యంత్రాంగాన్ని అమలు చేస్తోందని, వీఆర్వోలకు ఆ శాఖలో పని ఉండదన్నారు. అయితే కోర్టు మాత్రం జీవో 121 చట్ట విరుద్ధంగా ఉందని చెబుతూ దాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.