స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతి
వెంటనే రాష్ట్ర నేతలు ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మార్పులు చేసి విజయశాంతి, రఘునందన్ రావు పేర్లను చేర్చి మరో ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ జాబితాలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులకు చోటు దక్కలేదు. దీంతో విజయశాంతిని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని ప్రచారం జరిగింది. విజయశాంతి పార్టీ మారనున్నారనే కారణంతోనే ఆమెకు జాబితాలో చోటివ్వలేదనే వార్తలు వచ్చాయి.
కాగా, వెంటనే రాష్ట్ర నేతలు ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మార్పులు చేసి విజయశాంతి, రఘునందన్ రావు పేర్లను చేర్చి మరో ప్రకటన విడుదల చేశారు. మొత్తం 42 మంది నేతలు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
ఇక రాష్ట్రానికి ప్రచారానికి రానున్న నేతల్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. వీరితో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉన్నారు. రాష్ట్రానికి చెందిన నేతల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులకు చోటు దక్కింది.