Telugu Global
Telangana

నెక్స్ట్ రాములమ్మేనా..? ఆ ట్వీట్ అంతరార్థమేంటి..?

విజయశాంతి ట్వీట్ లో కనీసం ఒక్క సారి కూడా బీజేపీ ప్రస్తావన లేదు. జై తెలంగాణ అంటూ ట్వీట్ ముగించారే కానీ, జై బీజేపీ అని అనలేదు.

నెక్స్ట్ రాములమ్మేనా..? ఆ ట్వీట్ అంతరార్థమేంటి..?
X

రాజగోపాల్ రెడ్డి వెళ్లారు, వివేక్ వెళ్లారు.. నెక్స్ట్ ఎవరు..? బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ఎవరు రెడీగా ఉన్నారు..? అసంతృప్తుల జాబితా తీస్తే అందులో మొదట కనిపిస్తున్న పేరు విజయశాంతి. ఆమె కూడా ఆ గట్టు నుంచి ఈ గట్టుకి వచ్చేస్తారా..? అసలు రాములమ్మ మనసులో ఏముంది..? ఆమె తాజా ట్వీట్ అంతరార్థమేంటి..?


బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకెప్పుడూ సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని చెప్పుకొచ్చారు విజయశాంతి. ఏ పదవీ ఏనాడూ కోరుకోకున్నా, ఇప్పటికీ అనుకోకున్నా కూడా... సంఘర్షణ మాత్రమే మిగిలిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం ఇదీ అంటూ ఆమె సుదీర్ఘ ట్వీట్ వేశారు. తమ పోరాటం మొదలైంది తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమే కానీ బీఆర్ఎస్ కి వ్యతిరేకం అవుతామని కాదని చెప్పారామె. తన పోరాటం కేసీఆర్ కుటుంబంపైనే కానీ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదన్నారు. రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనేదే తన కోరిక అన్నారు విజయశాంతి.

రాములమ్మ ట్వీట్ లో అంతరార్థమేంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలామె బీఆర్ఎస్ కి అనుకూలంగా ట్వీట్ వేశారా, లేక బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారా అనేది తేలడంలేదు. ఆమె ట్వీట్ లో కనీసం ఒక్క సారి కూడా బీజేపీ ప్రస్తావన లేదు. జై తెలంగాణ అంటూ ట్వీట్ ముగించారే కానీ, జై బీజేపీ అని అనలేదు. మొత్తానికి రాములమ్మ మనసులో ఏదో ఉంది అనే విషయం అర్థమవుతోంది. ఇటీవల వరుస మీటింగ్ లకు డుమ్మా కొడుతున్న ఆమె, పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. కీలక నేతలంతా కమలానికి గుడ్ బై చెబుతున్న ఈ దశలో విజయశాంతి నిర్ణయం ఏంటి అనేది వేచి చూడాలి.


First Published:  1 Nov 2023 11:49 AM GMT
Next Story