అర్వింద్ నన్ను బాధపెట్టారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
తన పార్టీ మార్పు వ్యవహారం సింపుల్ గా జరగాలని కోరుకున్నారు విజయశాంతి. అందుకే మీడియాకి కూడా ఆమె దూరంగానే ఉన్నారు. ఎంపీ అర్వింద్ రియాక్షన్ మాత్రం తనను బాధ పెట్టిందని కుండబద్దలు కొట్టారు.
విజయశాంతి పార్టీ మారారు, హడావిడి లేకుండా, మంది మార్బలం వెంట లేకుండానే ఆమె కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారితే సహజంగా పాత పార్టీపై చాలామంది తీవ్ర విమర్శలుగుప్పిస్తుంటారు. కానీ ఇక్కడ విజయశాంతి అలాంటి వ్యాఖ్యానాలేవీ చేయలేదు, మీడియాను కూడా ఆమె దూరం పెట్టారు. అయితే ఆమె ట్వీట్లు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనను బాధపెట్టారని చెప్పారు విజయశాంతి.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ తనను ఎన్నో మాటలన్నారని చెప్పారు విజయశాంతి. కానీ వ్యక్తులను విమర్శించే సంస్కారం అటల్ జీ, అద్వానీ జీ, నాటి బీజేపీ తనకు నేర్పలేదని చెప్పారు. తనను విమర్శించే బదులు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని వస్తున్న విమర్శలకు అర్వింద్ సమాధానం చెబితే బాగుంటుందని చురకలంటించారు. తనను విమర్శలతో బాధ పెట్టారని చెప్పారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా మొక్కుబడిగా కృతజ్ఞతలు తెలిపారు విజయశాంతి. ఎంతో ఆదరణతో, సమున్నతమైన గౌరవంతో స్వాగతించిన, కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. అంటూ ట్వీట్ చేశారు. ఏ ఒక్క పేరునీ తన ట్వీట్ లో మెన్షన్ చేయలేదు. తాను పార్టీలో చేరడానికి కారణం ఫలానా అని కూడా ఆమె చెప్పలేదు. మొత్తమ్మీద తన పార్టీ మార్పు వ్యవహారం సింపుల్ గా జరగాలని కోరుకున్నారు విజయశాంతి. అందుకే మీడియాకి కూడా ఆమె దూరంగానే ఉన్నారు. ఎంపీ అర్వింద్ రియాక్షన్ మాత్రం తనను బాధ పెట్టిందని కుండబద్దలు కొట్టారు.