Telugu Global
Telangana

బీజేపీకి విజయశాంతి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరేది అప్పుడే..!

కొన్నాళ్లుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించి.. ఆ బాధ్యతలు కిషన్‌ రెడ్డికి అప్పగించడాన్ని విజయశాంతి బహిరంగంగానే తప్పు పట్టారు.

బీజేపీకి విజయశాంతి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరేది అప్పుడే..!
X

కొన్నాళ్లుగా రాజీనామాపై వస్తున్న ప్రచారాన్ని ఎట్టకేలకు నిజం చేశారు సీనియర్ లీడర్‌ విజయశాంతి. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. అయితే రాజీనామా లేఖను మాత్రం బయటకు విడుదల చేయలేదు విజయశాంతి.

కొన్నాళ్లుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించి.. ఆ బాధ్యతలు కిషన్‌ రెడ్డికి అప్పగించడాన్ని విజయశాంతి బహిరంగంగానే తప్పు పట్టారు. ఇక ఇటీవల జరిగిన ప్రధాని మోడీ, అమిత్ షా బహిరంగ సభలకు సైతం ఆమె హాజరుకాలేదు. కేవలం సోషల్ మీడియాలో పోస్టులకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారాన్ని ఏనాడూ బహిరంగంగా ఖండించని విజయశాంతి.. తాజాగా రాజీనామా చేసి కమలం పార్టీకి షాకిచ్చారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి లాంటి సీనియర్ నేతలు బీజేపీని వీడి.. హస్తం గూటికి చేరారు. అయితే విజయశాంతి రాజీనామాను ముందే ఊహించిన కమలం నేతలు.. ఆమెను బుజ్జగించే ప్రయత్నమూ చేయలేదు.

ఏ పార్టీలో చేరతారనేది విజయశాంతి ప్రకటించనప్పటికీ.. ఇటీవల కాంగ్రెస్‌ నేత మల్లు రవి వ్యాఖ్యలు చూస్తే ఆమె కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. ఈ నెల 17న తెలంగాణకు రాహుల్‌ గాంధీ రానున్నారు. ఈ పర్యటనలోనే విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.

First Published:  16 Nov 2023 2:05 AM GMT
Next Story