స్థాయి తగ్గించుకోవద్దు.. సీఎం రేవంత్ కు వీహెచ్ సలహా
ఒకప్పటి రేవంత్ రెడ్డికి, ఇప్పటి ముఖ్యమంత్రికి తేడా ఉందని అన్నారు వీహెచ్. ఆయన ఇప్పుడేమీ మాట్లాడటం లేదన్నారు. పోనీ తాను నేరుగా వెళ్లి రేవంత్ రెడ్డిని కలసి విషయం చెబుదామంటే, తనకు టైమ్ ఇవ్వడం లేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఎవరైనా సరే ఆయన్ను వచ్చి కలవాలని, అంతేకాని ఆయనే వెళ్లి వారిని కలవడం, పార్టీలోకి ఆహ్వానించడం సరికాదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. అలా వెళ్లి ఆహ్వానించి రేవంత్ తన స్థాయి తగ్గించుకోవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి ఒకవైపు మాత్రమే వింటున్నారని, రెండువైపులా ఆయన కార్యకర్తల మాట వినాలని చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు వీహెచ్. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, అదే సమయంలో ఎవరికీ అన్యాయం జరగకూడదనేది తన అభిమతం అని చెప్పారు.
ఒకప్పటి రేవంత్ రెడ్డికి, ఇప్పటి ముఖ్యమంత్రికి తేడా ఉందని అన్నారు వీహెచ్. ఆయన ఇప్పుడేమీ మాట్లాడటం లేదన్నారు. పోనీ తాను నేరుగా వెళ్లి రేవంత్ రెడ్డిని కలసి విషయం చెబుదామంటే, తనకు టైమ్ ఇవ్వడం లేదని చెప్పారు. తక్కువ టైమ్ లో పార్టీని బలోపేతం చేసి, గెలిపించి, సీఎం అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని పొగడ్తల్లో ముంచెత్తారు. అదే సమయంలో ఆయన ఇప్పుడు మారిపోయారని, ఇప్పుడున్న పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు వీహెచ్.
వీహెచ్ బాధ ఏంటి..?
ఎన్నికల ముందు వి.హనుమంతరావు హడావిడి కనిపించినా, కాంగ్రెస్ గెలిచాక ఆయన పెద్దగా లైమ్ లైట్లోకి రాలేదు. పార్టీ పరంగా కూడా ఎలాంటి కీలక పదవి లేదు. పోనీ రాజ్యసభ ఇస్తారన్నా.. ఆ ఆశ కనుమరుగైంది, ఖమ్మం లోక్ సభ సీటు అడిగినా ఫలితం లేదు. సీనియార్టీ, బీసీ కార్డుతో ఏం చేయాలో తెలియక ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఆరోపణలు చేశారు వీహెచ్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనల పేరుతో కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని ఆరోపించారు వీహెచ్. ఒకరకంగా చేరికలను కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ కేడర్ కు న్యాయం చేయకుండా.. తమ కార్యకర్తలపై కేసులు పెట్టినవాళ్లకు ప్రాధాన్యత లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని వీడినవారు, అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికార కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఆరోపించారు వీహెచ్.