మీ కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ వస్తువులు బద్దలు కొట్టండి... హైదరాబాద్ లో రేజ్ రూం
Rage Room in Hyderabad: మీకు కోపం ఆగడం లేదా అయితే మాదాపూర్ లోని రేజ్ రూం కు వెళ్ళి అక్కడున్న వస్తువులను బద్దలు కొట్టండి. అక్కడ ఓ యువకుడు మన కోపాన్ని బిజినెస్ గా మార్చిపడేశాడు.
కొందరు కోపం వస్తే ఆపుకోలేరు. పిల్లలే కాదు కొందరు పెద్దవాళ్ళు కూడా కోపాన్ని అణుచుకోలేక ఇంట్లో వస్తువులను బద్దలు కొట్టడం, ఇతరులను కొట్టడం చేస్తుంటారు. అలా ఇంట్లో వస్తువులను బద్దలు కొట్టకుండా, మనుషులను కొట్టకుండా మీ కోపాన్ని తగ్గించడానికి హైదరాబాద్ లో ఓ స్థలముంది. అక్కడ మీకేమీ క్లాసులు చెప్పడం, కోపం తగ్గించుకోమంటూ హిప్టనైజ్ చేయడం వంటి పనులేమీ చేయరు. మీరు బద్దలు కొట్టడానికి అక్కడ అనేక వస్తువులను ఉంచుతారు. మీకు కోపం రాగానే అక్కడికి వెళ్ళి వాళ్ళిచ్చే కర్ర తీసుకొని కోపం తగ్గిందాకా అక్కడ విధ్వంస సృష్టించవచ్చు.
దీన్ని రేజ్ రూం అంటారు. ఆంగర్ రూం అని కూడా పిలుస్తారు. విదేశాలలో ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే మనదేశంలో ఇది కొత్త. హైదరాబాద్ మాదాపూర్ లో 25 ఏళ్ల సూరజ్ పుసర్ల అనే యువకుడు దీన్ని ప్రారంభించాడు.
"నేను చిన్నతనంలో కోపంతో ఇంట్లో రిమోట్‌లు పగలగొట్టేవాడిని. అలా ఇంట్లో వస్తువులను బద్దలు కొట్టకుండా కోపం ఎలా తీర్చుకోవాలా అనే ఆలోచనకు ప్రతి రూపమే ఈ రేజ్ రూం. ప్రజలు ఇక్కడికి రావాలని వస్తువులను విచ్ఛిన్నం చేసి వారి ఒత్తిడిని తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను.'' అని సూరజ్ అన్నారు. కోపం తగ్గించుకోవడానికే కాదు ఇది ఫన్ కూడా ఇస్తుంది అన్నారాయన.
ఇక్కడ ఒకేసారి ఏడుగురు వ్యక్తుల కోసం రెండు రేజ్ రూమ్‌లు ఉన్నాయి. ప్రతి సెషన్ దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. కస్టమర్‌లకు బాణాలు, బాక్సింగ్ కిట్లు, రేజ్ బాల్స్ ఇస్తారు.
సందర్శకులు(కోపిష్టులు) మూడు ప్యాకేజీలలో దేన్నైనా ఎంచుకోవచ్చు. 'క్వికీ' ఇక్కడ ఏడు సీసాలు, ప్లాస్టిక్లు, కీబోర్డులు, మౌస్లు, స్పీకర్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో కూడిన క్రేట్ రూ. 1,300కి అందించబడుతుంది. రూ. 1,500 ఖరీదు చేసే మరో ప్యాకేజీ 'రఫ్ డే'లో 15 బాటిళ్లతో కూడిన రెండు డబ్బాలు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి, అయితే రూ. 2,800 ఖరీదు చేసే 'రేజ్ మోడ్' లో వాషింగ్ మెషీన్, టెలివిజన్ సెట్, రిఫ్రిజిరేటర్, ఓవెన్, ల్యాప్‌టాప్ వంటి భారీ వస్తువులుంటాయి. వీటన్నింటిని మీరు ఇష్టం వచ్చినట్టు బద్దలు కొట్టవచ్చు.
అయితే కోపం వచ్చిన వాళ్ళు బద్దలు కొట్టే వస్తువులేవీ పనికొచ్చేవి కావు. పనికిరాకుండా పోయిన వస్తువులను వీళ్ళు కొనుక్కొస్తారు.
"మేము ఈ స్క్రాప్ కోసం కొన్ని స్టార్టప్‌లతో ఒప్పందం చేసుకున్నాము. మేము వారి నుండి స్క్రాప్ కొనుగోలు చేస్తాము. తిరిగి బద్దలైన ,విరిగిన వస్తువులన్నీ కొన్ని కంపెనీల సహకారంతో రీసైకిల్ చేస్తాము. ఏదీ వృధా కాదు'' అని రేజ్ రూం ఓనర్ సూరజ్ చెప్పారు.
ఈ రేజ్ రూం లోకి 14 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలను అనుమతించరు. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను తీసుకొని రావాలి. వారికి పారిశ్రామిక నాణ్యత గల సూట్లు, హెల్మెట్లు, చేతి తొడుగులు, బూట్లు అందజేస్తున్నారు. అందువల్ల ప్రజలు వస్తువులను పగలగొట్టేటప్పుడు వారికి ఎలాంటి గాయాలు కావు.
కాగా ఈ రేజ్ రూం ల పై విరుద్ద వాదనలు ఉన్నాయి. ఈ రూంలు ప్రజల్లో కోపాన్ని తగ్గించి మానసికంగా ప్రశాతంగా ఉండేందుకు ఉపయోగపడతాయని కొందరు వాదిస్తుండగా, ఇవి పిల్లల్లో మరింతగా హింసాత్మక ప్రవృత్తిని పెంపొందిస్తాయనే వాదనలు మరికొందరు వినిపిస్తున్నారు. ఏదేమైనా మన కోపం మనకు శతృవైనప్పటికీ మరొకరికి మాత్రం మంచి బిజినెస్ అవుతున్నది.