వెంకట్ రెడ్డి కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు -బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చారు.

మునుగోడు నేత రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 21 న హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని, ఆ రోజే ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతానని రాజగోపాలరెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో షాతో సమావేశమై పార్టీలో తన చేరికను గురించి ప్రస్తావించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో మునుగోడు ఉప ఎన్నిక చరిత్ర సృష్టిస్తుందన్నారు. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని బాంబు పేల్చారు. వెంకట రెడ్డి బీజేపీలో చేరవచ్చునన్న ఊహాగానాలను తాము గమనిస్తున్నామన్నారు. మునుగోడు ఎన్నికతోనైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరింతమంది నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరనున్నారని జోస్యం చెప్పారు.
ఈ హాట్ హాట్ పొలిటికల్ పరిణామాల నేపథ్యంలో వెంకటరెడ్డి కూడా పరోక్షంగా బీజేపీలో తన చేరికకు సంకేతాలు పంపడం విశేషం, అందుకు తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఆయనకు కలిసి వచ్చాయి. తనకు చెప్పకుండా, తనను సంప్రదించకుండా ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించిన ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నేను ఢిల్లీలో ఉండగా తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని చండూరులో పార్టీ సభానెలా నిర్వహిస్తారని నిప్పులు కక్కారు. చండూరు సభకు గైర్ హాజరవుతానని చెప్పకనే చెప్పారు. అన్నదమ్ములిద్దరూ ఢిల్లీలో అమిత్ షాను వేర్వేరుగా కలిసినా.. దీని వెనుక మతలబు ఉండనే ఉంది. తెలంగాణకు వెయ్యి కోట్ల వరద సాయం చేయాలని కోరేందుకు తాను ఆయనను కలిసినట్టు వెంకటరెడ్డి చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి 1400 కోట్ల నష్టం జరిగిందని అమిత్ షాకు వివరించినట్టు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ కి పులిమీద పుట్రలా..
తెలంగాణ కాంగ్రెస్ కి పులిమీద పుట్రలా పార్టీనేత దాసోజు శ్రవణ్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. .. రేవంత్ రెడ్డిపై ఫైరయిన ఆయన.. రేవంత్ నాయకత్వంలో ధనం, కులం ప్రధాన పాత్ర వహిస్తున్నాయని, అణగారిన వర్గాలను ఆయన మరింత అణచివేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్నారు.. ప్రశ్నించేవారిని సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇస్తూ సొంత పార్టీ నేతలను బలహీనపరుస్తున్నారు అని శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ తప్పులు చేస్తుంటే మాణిక్కం ఠాగూర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన ఇన్నాళ్లకు తన అక్కసునంతా వెలిగక్కారు.
శ్రవణ్ కి నచ్ఛజెప్పేందుకు పార్టీ సీనియర్ నేతలు చేసిన యత్నాలు వృధా అయ్యాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో రాజగోపాలరెడ్డి రేపిన తుపాను కారణంగా రానున్న రోజుల్లో పార్టీకి మరింత దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికతో బాటు మరికొన్ని ఉపఎన్నికలు కూడా వచ్చినా రావచ్చు.
కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, బీజేపీ, అమిత్ షా , తెలంగాణ ఆగస్టు 21, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్, రాజీనామా
komatireddy rajagopala reddy, bjp, amit shah, telangana, august 2, venkatareddy, revanth reddy, dasoju sravan
rajagopala reddy to join in bjp on august 21