సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ఆగిపోయిన వాహనాలు
ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్తుండటంతో రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున స్వంత గ్రామాలకు వెళ్తున్నారు. ఈ రోజు నుంచి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో అనేక కుటుంబాలు గ్రామాలకు బయలు దేరాయి.
ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్తుండటంతో రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌ను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. టోల్ బూత్ లలో రెండు సెకన్లలో వాహనాలు వెళ్లేలా ఏర్పాట్లు చేయడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయి.
మరోవైపు జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్స్ వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైవేపై 24 గంటల పాటు గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పంతంగితో పాటు కొర్లపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద కఠిన చర్యలు తీసుకున్నారు. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మరో వైపు ఆర్ టీ ఏ అధికారులు హైదరాబాద్, విజయవాడ హైవే పై పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. నిబందనలకు విరుద్దంగా నడుస్తున్న 6 బస్సులను సీజ్ చేశారు.