గరికపాటిని మరో వివాదంలోకి లాగిన వర్మ
ఆర్జీవీ గరికపాటిని వదిలిపెట్టేలా లేడు. గరికపాటి గతంలో వివాదాస్పదంగా మాట్లాడిన వీడియోలను బైటికి తీసి ట్విట్టర్ లో షేర్ చేస్తూ కామెంట్లు కురిపిస్తున్నాడు.
చిరంజీవి - గరికపాటి నరసింహారావు ఎపిసోడ్ లో గరికపాటిని ఇప్పటికిప్పుడు వదిలేలా కనిపించడం లేదు రాంగోపాల్ వర్మ. ఆయన వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ సమసిపోతున్న వివాదాన్ని ఇంకా ఇంకా కెలుకుతున్నారు. గరికపాటి ప్రవచనాలపై దృష్టి పెట్టిన వర్మ గతంలో ఆయన వివాదాస్పదంగా మాట్లాడిన, నోరు జారి మాట్లాడిన వీడియోలు బయటకు తీసి ఇవేనా గరికపాటి గారి ప్రవచనాలు అంటే..అని ప్రశ్నిస్తున్నారు.
వర్మ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియోలో గరికపాటిగారు మాట్లాడుతూ.. అమ్మాయిల వస్త్రధారణపై విమర్శలు చేశారు. 'అమ్మాయి అందమైన అవయవాలు పొందికగా, బిగువుగా కనపడుతుంటే కుర్రాడన్నవాడు ఎవడైనా ఊరుకుంటాడా అండీ? అసలు మనమెందుకు అందాల్ని ప్రదర్శించాలి? మన హక్కు అంటే ఏం చెబుతారు? మాది లార్డ్ హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు అన్ని విప్పుకుని ఇష్టమొచ్చినట్లు తిరుగుతుంటే ఎలా..? పైగా పెళ్ళైన వారు కూడా.. ఎవరి కోసం ఈ ప్రదర్శనలు? అని గరికపాటి ఆ వీడియోలో ప్రశ్నించారు. అమ్మాయిలు ఒకసారి దీని గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.దీనిపై వర్మ కామెంట్స్ చేస్తూ 'గొర్రె పాటి కంటే అగౌరవంగా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వారిని ఎవరినీ చూడలేదు' అంటూ వ్యాఖ్యానించారు.
వర్మ షేర్ చేసిన మరో వీడియోలో.. గరికపాటి మాట్లాడుతూ 'చేసిన తప్పు చెప్పాలి. మా అబ్బాయి చిత్రజ్యోతి పేపర్ చూస్తుంటే నేను కూడా చూసా. అందులో మహానటి అనుష్క ఓ ఫోజులో నిలుచుంటే నేనూ చూసా. మనమూ ఒక కవి కదా.. తిన్నగా ఎలా ఉండగలం. పై నుంచి కింద వరకు అనుష్కను చూసా. మనల్నే ఆకర్షిస్తుంటే మా అబ్బాయి లాంటి కుర్రాలను ఆకర్షించదా.. అనుకున్నా' అని గరికపాటి పేర్కొన్నారు. ఈ వీడియోకు కూడా వర్మ తనదైన శైలిలో 'ఓహో..ఆహా..అడ్డడడ్డడ్డే' అని కామెంట్స్ చేశాడు. గరికపాటి పై వర్మ చేస్తున్న ట్వీట్లు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.