Telugu Global
Telangana

వందే భారత్: పేరు గొప్ప.. ప్రయాణంలో టెన్షన్

త్వరగా గమ్యస్థానం చేరాలనుకునేవారు సూపర్ ఫాస్ట్ రైళ్లను ఆశ్రయిస్తారు. వందేభారత్ కూడా అలాంటి వారికి మంచి ప్రత్యామ్నాయం అనుకున్నారు. కానీ వరుసగా ఎదురవుతున్న అవాంతరాలు ఆ రైలుపై ఉన్న నెగెటివ్ సెంటిమెంట్ ని బలపరుస్తున్నాయి.

వందే భారత్: పేరు గొప్ప.. ప్రయాణంలో టెన్షన్
X

వందే భారత్ రైళ్లకు ఉన్న నెగెటివ్ సెంటిమెంట్ తెలంగాణలో కూడా రుజువైంది. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వందేభారత్ రైలుని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లోనే దానిపై రాళ్లదాడి జరిగింది. అయితే అది ఆకతాయిల పని కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా వందే భారత్ రైలు ఎద్దుని ఢీకొని ఆగిపోయింది. ఇంజిన్ సొట్టపోయింది. లోపలిభాగం దెబ్బతిన్నది. రైలు ముందుకు కదలకపోవడంతో దానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులు గంటలసేపు నరకం చూశారు.

త్వరగా గమ్యస్థానం చేరాలనుకునేవారు సూపర్ ఫాస్ట్ రైళ్లను ఆశ్రయిస్తారు. వందేభారత్ కూడా అలాంటి వారికి మంచి ప్రత్యామ్నాయం అనుకున్నారు. కానీ వరుసగా ఎదురవుతున్న అవాంతరాలు ఆ రైలుపై ఉన్న నెగెటివ్ సెంటిమెంట్ ని బలపరుస్తున్నాయి. వందే భారత్ రైలు ఎక్కితే సమయానిక గమ్యస్థానం చేరతామో లేదో కూడా డౌటే. మధ్యలో ఆవు, ఎద్దు, గేదె.. ఇలా ఏదయినా అడ్డం రావచ్చు. ఇంజిన్ దెబ్బతిని రైలు అక్కడికక్కడే ఆగిపోవచ్చు. ఆ తర్వాత గంటలసేపు పట్టాలపైనే పడిగాపులు పడాల్సి రావొచ్చు. ఇదీ జరుగుతున్న కథ. ఇలాంటి ఉదాహరణలు ఇటీవల చాలా బయటకొచ్చాయి. అందుకే వందే భారత్ ప్రయాణం సుఖవంతం, శుభప్రదం అనే కాకుండా, అనుమానాస్పదం అని కూడా అనుకోవాల్సిందే.

తాజా ఘటనలో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం బయల్దేరిన వందే భారత్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే ఎద్దును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం దెబ్బతింది. దీంతో ఘటనాస్థలిలోనే రైలును నిలిపివేసిన సిబ్బంది మరమ్మతులు చేశారు. గంటల తరబడి ప్రయాణికులు రైలు లోనే వేచి చూశారు. వేగంగా గమ్యస్థానం చేరుకుందామనుకుని సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కినవారు, మామూలు రైలే బెటర్ అనుకున్నారు. వందే భారత్ తో చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నారు.

First Published:  12 March 2023 8:36 AM IST
Next Story