Telugu Global
Telangana

అడ్డంగా దొరికిన V6, వెలుగు.. కాళేశ్వరంపై రాసింది కట్టుకథలేనా?

దురదృష్టవశాత్తు మేడిగడ్డలో పిల్లర్లు కుంగడంతో నీటిని దిగువకు వదిలేసింది రేవంత్ సర్కార్. దీంతో ఎల్లంపల్లికి ఎగువ నుంచి వరదరాక.. దిగువ నుంచి రివర్స్ పంపింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వల్లు 7 టీఎంసీలకు పడిపోయాయి.

అడ్డంగా దొరికిన V6, వెలుగు.. కాళేశ్వరంపై రాసింది కట్టుకథలేనా?
X

V6 చానల్‌, వెలుగు పత్రిక.. గడిచిన మూడు, నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాయని వార్త లేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎకరాకు కూడా నీరందలేదంటూ V6 చానల్‌, వెలుగు పత్రిక రాసుకొచ్చాయి. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు భారమని...వైట్ ఎలిఫెంట్‌ అంటూ ప్రచారం చేశాయి. ప్రత్యేక కథనాలతో, చర్చ కార్యక్రమాలతో కాళేశ్వరం దండగ అంటూ జనాల్లోకి తీసుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నించాయి.

అయితే తాజాగా రాసిన ఓ కథనంతో వెలుగు పత్రిక అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితి తెలిసిందే. గోదావరిపై SRSP తర్వాత ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న ఎల్లంపల్లిలోనూ నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఓ వార్త రాసింది వెలుగు పత్రిక. కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్‌తోనే ఎల్లంపల్లిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని రాసుకొచ్చింది. అంటే కాళేశ్వరం నుంచి రివర్స్‌ పంపింగ్ నిలిచిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్‌ లోలెవల్‌కు పడిపోయాయనేది ఈ వార్త సారాంశం. అంతేకాదు..కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఎల్లంపల్లి వాటర్‌ హబ్‌గా మారిందని ఈ వార్తలో చెప్పింది వెలుగు. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ జరిగి ఉంటే ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేర్‌, దిగువన లోయర్‌ మానేరు, అనంతగిరి రిజర్వాయర్‌, మల్లన్నసాగర్‌, రంగనాయక సాగర్‌ వరకు నీరు తరలించే అవకాశం ఉండేదని రాసింది. నిజానికి గత మూడు, నాలుగేళ్లుగా జరిగింది ఇదే. కానీ వెలుగు మాత్రం వర్షాలు సమృద్ధిగా పడడం వల్లే రిజర్వాయర్స్‌లో నీళ్లు వచ్చాయని, కాళేశ్వరం వల్ల కాదంటూ నమ్మబలికింది.


గోదావరి నదిపై మహారాష్ట్రలో ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో దిగువకు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఓ దశలో SRSP పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సమాలోచనలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం..కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ప్రాణహితలో సరిపడినంత నీరు ఉందని గుర్తించింది. ఇందులో భాగంగా ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర బ్యారేజ్‌ను నిర్మించింది. ఇక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేవారు. తద్వారా మేడిగడ్డ నుంచి ఎగువన ఎల్లంపల్లి వరకు గోదావరిని సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేర్‌, అనంతగిరి, రంగనాయకసాగర్‌, 50 టీఎంసీల సామర్థ్యమున్న మల్లన్న సాగర్‌కు నీటిని తరలించేవారు. ఆయా రిజర్వాయర్‌ల నుంచి సమీప గ్రామాల చెరువులను నింపి భూగర్భ జల మట్టాలు తగ్గకుండా చర్యలు తీసుకున్నారు.

కానీ దురదృష్టవశాత్తు మేడిగడ్డలో పిల్లర్లు కుంగడంతో నీటిని దిగువకు వదిలేసింది రేవంత్ సర్కార్. దీంతో ఎల్లంపల్లికి ఎగువ నుంచి వరదరాక.. దిగువ నుంచి రివర్స్ పంపింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వల్లు 7 టీఎంసీలకు పడిపోయాయి. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు. ఇక ఈ వార్తతో వెలుగు పత్రిక అడ్డంగా దొరికిపోయిందని.. ఇన్నాళ్లూ రాసింది కట్టుకథలేనని రుజువైందని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు.

First Published:  4 April 2024 10:13 PM IST
Next Story