గాంధీ భవన్ లో వద్దంటే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెడతా
"నన్ను మీటింగ్ కి పిలవకపోతే, రోడ్డుమీద నిలబడి మాట్లాడతా.. నేను ఎక్కడ మాట్లాడినా అది వార్తే.." అన్నారు వీహెచ్.
ప్రభుత్వాన్ని విమర్శస్తూ గాంధీ భవన్ లో వి.హనుమంతరావు నిర్వహించే ప్రెస్ మీట్లకు అనుమతి లేదంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేయడంపై ఆయన మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గాంధీ భవన్ లో వద్దంటే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెడతానన్నారు. తాను ఎక్కడ మాట్లాడినా అది న్యూస్ అవుతుందని, తనని ఆపేవారు ఎవరని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా తాను ప్రభుత్వాన్ని విమర్శించానని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేకపోతే చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు వీహెచ్.
నా బాధ అదే..
బీఆర్ఎస్ హయాంలో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని, వాటిని తొలగించేందుకు రేవంత్ రెడ్డిని కలవాలనుకున్నానని, తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు వీహెచ్. 15సార్లు ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. కనీసం 2 నిమిషాలు తనతో ఫోన్లో మాట్లాడే తీరిక రేవంత్ రెడ్డికి లేదా అన్నారు వీహెచ్. నిజాలు మాట్లాడితే తనకు మైక్ కట్ చేస్తామంటున్నారని, గాంధీ భవన్‌లో మాట్లాడనివ్వకపోతే ఇంట్లోనుంచే మాట్లాడతానన్నారు. వచ్చే వారం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు తనకు ఆహ్వానం రాకపోవచ్చని అన్నారు వీహెచ్. "నన్ను మీటింగ్ కి పిలవకపోతే, రోడ్డుమీద నిలబడి మాట్లాడతా.. నేను ఎక్కడ మాట్లాడినా అది వార్తే.." అన్నారాయన.
ఖమ్మంపై పీటముడి..
కాంగ్రెస్ లో ఖమ్మం సీటు ఆశించే నాయకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. వీహెచ్ కూడా ఖమ్మం సీటు రాదనే నిరాశలోనే ప్రభుత్వంపై విమర్శలు పెంచారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మరోవైపు ఖమ్మంకోసం కాచుకు కూర్చున్న వారంతా సీనియర్లే కావడం విశేషం. భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా హైకమాండ్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు.