Telugu Global
Telangana

బీసీ బిడ్డకు ఇంత అవమానమా..? బండికి వీహెచ్ ఓదార్పు

కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవినుంచి బండిని తొలగించారని అన్నారు వీహెచ్. బీసీ బిడ్డకు బీజేపీలో అన్యాయం జరిగిందని సానుభూతి చూపించారు.

బీసీ బిడ్డకు ఇంత అవమానమా..? బండికి వీహెచ్ ఓదార్పు
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిని నియమించడంపై బీజేపీలో కూడా కొన్ని అసంతృప్త గళాలు వినిపించాయి. అయితే విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ విషయంపై స్పందించారు. ఆయన బండికి మద్దతుగా మాట్లాడారు. బీసీ బిడ్డకు బీజేపీలో అన్యాయం జరిగిందని సానుభూతి చూపించారు.

బండిని ఎందుకు మార్చారంటే..?

కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవినుంచి బండిని తొలగించారని అన్నారు వీహెచ్. బీజేపీకి బీఆర్ఎస్ బి-టీమ్ అంటూ విమర్శించారు.

అబ్ కీ బార్ కాంగ్రెస్ సర్కార్..

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది బీఆర్ఎస్ నినాదం. అయితే అబ్ కీ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు వి.హనుమంతరావు. తెలంగాణలో ఘర్ వాపసి తో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతోందని చెప్పారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా, వాటిని తాము పరిష్కరించుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీసీలకు మెజార్టీ సీట్లు ఇవ్వాలి..

కర్నాటకలో బీసీలు, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పక్షాన నిలిచాయని, అందుకే అక్కడ తమ పార్టీకి అద్భుత విజయం దక్కిందన్నారు వీహెచ్. రాబోయే రోజుల్లో బీసీ గర్జన పేరుతో తెలంగాణలో తమ బలం చూపిస్తామన్నారు. తాము అగ్రకులాలకు వ్యతిరేకం కాదని, కానీ బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 40శాతం సీట్లు కేటాయించాలని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ముందు కూడా ఈ డిమాండ్ ఉంచుతామన్నారు. బీసీలు గతంలో అవమానాలు భరించారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు వీహెచ్.

First Published:  8 July 2023 7:56 PM IST
Next Story