Telugu Global
Telangana

నాకు జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే.. - వీహెచ్ వేదాంతం

పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం సరికాదన్నారు. 42 ఏళ్లు పదవుల్లో ఉన్న వ్యక్తి ఆజాద్ అని, రాజీనామా చేయకుండా ఉంటే ఆయనకు విలువ‌ ఉండేదని వీహెచ్‌ అన్నారు.

నాకు జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే.. - వీహెచ్ వేదాంతం
X

"నాకు జరిగిన అవమానంతో పోల్చుకుంటే నీకు జరిగింది ఓ లెక్కా.." అంటూ ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు హాస్యం పండిస్తారు. ఇప్పుడు అదే టైప్‌లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, గులాంనబీ ఆజాద్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో తనకు అన్యాయం జరిగిందని, అయినా తాను పార్టీని వదిలిపెట్టలేదని చెప్పారు. పార్టీలోనే ఉంటే ఆజాద్‌కి గౌరవం దక్కేదని వీహెచ్‌ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆజాద్‌, తాను ఒకే సమయంలో వచ్చానని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు. పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం సరికాదన్నారు. 42 ఏళ్లు పదవుల్లో ఉన్న వ్యక్తి ఆజాద్ అని, రాజీనామా చేయకుండా ఉంటే ఆయనకు విలువ‌ ఉండేదని వీహెచ్‌ అన్నారు.

వారసుడే అధ్యక్షుడు..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబ వారసులే ఉండాలన్నారు వీహెచ్. రాహుల్ గాంధీయే అధ్యక్షుడు కావాలని, లేదంటే ప్రియాంక గాంధీ అయినా పర్వాలేదన్నారు. ఇతరులు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడినా.. అది కుదిరే పనికాదన్నారు. గాంధీ కుటుంబ వారసులు మినహా ఇంకెవరు పార్టీ అధ్యక్ష పీఠం అధిష్టించినా.. నేతలు జనాల్లోకి వెళ్లలేరని చెప్పారు వీహెచ్. ఏఐసీసీకి ఎన్నికలు పెడితే గాంధీ కుటుంబం వ్యక్తినే ఎన్నుకోవాలని సూచించారు.

ఆనాడే సీఎం అవకాశం చేజారింది..

గతంలో సంజయ్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొందో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని అన్నారు వీహెచ్. కష్టకాలంలో కొంత మంది నేతలు పార్టీని వీడటం బాధాకరం అని అన్నారు. సంజయ్ గాంధీ అప్పట్లో ఉమ్మడి ఏపీకి వచ్చినప్పుడు ప్రైమరీ మెంబర్ షిప్ చేయని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను తాను నిలువరించానని, వారంతా తనకి వ్యతిరేకంగా పనిచేశారని, ఆ తర్వాత ఏపీకి సీఎం అయ్యే అవకాశం తనకు మిస్ అయింద‌ని చెప్పారు వీహెచ్.

అంతా అవకాశవాదులే..

పార్టీని వీడుతున్న వారంతా రకరకాల కారణాలు చెబుతూ, విమర్శలు చేస్తున్నా ఎవరి భవిష్యత్తు కోసం వారు పార్టీ మారుతున్నారని, అంతా అవకాశవాదులేనన్నారు వీహెచ్. ముగ్గురు ఎంపీలున్న బీజేపీ ఇప్పుడు అధికారంలోకి రాగలిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న స్థితి నుంచి తిరిగి అధికారంలోకి రాకపోతుందా అని ఆశాభావం వ్యక్తం చేశారు వీహెచ్. పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. అన్యాయం జరిగినా తనలా ఓర్చుకోవాలని హితవు చెప్పారు.

First Published:  1 Sept 2022 5:10 PM IST
Next Story