Telugu Global
Telangana

వీహెచ్‌ను పిలిపించుకుని ఆ హామీ ఇచ్చిన రేవంత్

కాంగ్రెస్‌లో చేరికలపై మొన్న వీహెచ్ గుస్సా అయ్యారు. అక్రమంగా సంపాదించుకున్న బీఆర్ఎస్‌ నాయకులంతా ఇవాళ అధికారంలో ఉన్నామని కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఫైర్ అయ్యారు.

వీహెచ్‌ను పిలిపించుకుని ఆ హామీ ఇచ్చిన రేవంత్
X

సీఎం రేవంత్‌రెడ్డితో సీనియర్ నేత వి. హన్మంతరావు భేటీ అయ్యారు. ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేదని అధిష్టానంపై అలిగిన వీహెచ్.. కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే విషయమై మొన్న మీడియా ముందు తీవ్ర అసంతృత్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్‌తో వీహెచ్‌కు కబురు పంపారు. దీంతో ఇవాళ హన్మంతరావును వెంట తీసుకెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిపించారు మహేష్‌ కుమార్ గౌడ్. వీహెచ్‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కానీ, పార్టీలో సీనియర్‌గా, బీసీ నాయకుడిగా ఉన్న ఆయనకు ఏం పదవి ఇస్తారనే దానిపై మాత్రం సీఎం స్పష్టత ఇవ్వలేదు.

కాంగ్రెస్‌లో చేరికలపై మొన్న వీహెచ్ గుస్సా అయ్యారు. అక్రమంగా సంపాదించుకున్న బీఆర్ఎస్‌ నాయకులంతా ఇవాళ అధికారంలో ఉన్నామని కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి తీరును ఆయన తప్పు బట్టారు. కలిసి మాట్లాడుదామంటే టైమ్‌ ఇవ్వట్లేదని, ఫోన్ లిఫ్ట్‌ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీహెచ్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్ పెద్దలకు ఆగ్రహం తెప్పించాయి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎంత సీనియర్లయినా క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్ ఓ ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు.

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి గాంధీ భవన్‌లో మైక్‌ కూడా ఇవ్వొద్దు అని పార్టీ పెద్దలు ఆదేశించారనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే వీహెచ్‌పై పార్టీ వ్యవహరించిన తీరుమీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీహెచ్‌ మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. పెద్దాయన్ని పిలిపించుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

First Published:  27 March 2024 12:23 PM IST
Next Story