అప్పుడు గడ్డం.. ఇప్పుడు రాజకీయ సన్యాసం
ఉత్తమ్ మెజార్టీ సరే, మరి కాంగ్రెస్ సంగతేంటి..? అని కౌంటర్లిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉత్తమ్ కుమార్ ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? అని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం ఛాలెంజ్ పై ఇటీవల మంత్రి కేటీఆర్ సెటైర్లు పేల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీసేది లేదని గతంలో ఛాలెంజ్ చేసిన ఆయన.. ఇంకా ఆ గడ్డంతోనే తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఈసారి కూడా ఆయనకు గడ్డం తీసే ఛాన్స్ రాదన్నారు. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ మరో కొత్త ఛాలెంజ్ చేయడం విశేషం. ఈసారి ఆయన తన నియోజకవర్గ మెజార్టీపై వైరివర్గాలకు సవాల్ విసిరారు. కచ్చితంగా 50వేల మెజార్టీ పైన సాధిస్తానంటున్నారు ఉత్తమ్.
సూర్యాపేట జిల్లా వేపల సింగారం గ్రామంలో పర్యటించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురికి కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్న ఆయన.. ఈసారి హుజూర్ నగర్ అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలో తన మెజార్టీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50వేలకంటే మెజార్టీ తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఒక్కఓటు తక్కువగా వచ్చినా తాను రాజకీయాలనుంచి వైదొలగుతానన్నారు ఉత్తమ్.
మరి కాంగ్రెస్ సంగతేంటి..?
ఉత్తమ్ మెజార్టీ సరే, మరి కాంగ్రెస్ సంగతేంటి..? అని కౌంటర్లిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉత్తమ్ కుమార్ ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? ఆయనకు 50వేలకంటే ఎక్కువ మెజార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. గతంలో గడ్డం ఛాలెంజ్ చేసి.. ఇంకా ఆ గడ్డంతోనే తిరుగుతున్నారని, ఇప్పుడిక కొత్త ఛాలెంజ్ లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ ఛాలెంజ్ కేవలం హుజూర్ నగర్ కే పరిమితమా, లేక ఆయన భార్య పోటీ చేస్తున్న కోదాడకు కూడా వర్తిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ఛాలెంజ్ తో ఆయన గడ్డం ఛాలెంజ్ కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచింది.