ఉప్పల్ సీటు కోసం ఎమ్మెల్సీ కవితను కలసిన నేతలు
బీఆర్ఎస్ తొలిజాబితా రేపు విడుదల కాబోతోంది. కొన్నిచోట్ల సిట్టింగ్ లకు సీట్లు దక్కే ఛాన్స్ లేదని ఇప్పటికే సిగ్నల్స్ అందాయి. అయినా సరే ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేతకు విన్నపాలు అందిస్తున్నారు.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార బీఆర్ఎస్ లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాదాపుగా సిట్టింగ్ లకే సీట్లు ఖరారు చేయాలనుకుంటున్న సీఎం కేసీఆర్.. కొన్ని స్థానాల్లో మార్పు అనివార్యం అనే సంకేతాలిచ్చారు. దీంతో ఆయా స్థానాల ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి పంచాయితీ ఎమ్మెల్సీ కవిత వద్దకు చేరింది.
ఎమ్మెల్సీ కవితతో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈరోజు భేటీ అయ్యారు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి ఈసారి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కదని ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మరోసారి టికెట్ పై ఆశ పెట్టుకున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఉప్పల్ సీటుకోసం ప్రయత్నిస్తున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్.. ఇద్దరూ ఎమ్మెల్సీ కవితను కలవడం ఆసక్తిగా మారింది. తమ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇప్పించేలా చేయాలని వారు కవితను కోరినట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ తొలిజాబితా రేపు విడుదల కాబోతోంది. కొన్నిచోట్ల సిట్టింగ్ లకు సీట్లు దక్కే ఛాన్స్ లేదని ఇప్పటికే సిగ్నల్స్ అందాయి. అయినా సరే ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేతకు విన్నపాలు అందిస్తున్నారు. ఉప్పల్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు, టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ ఇద్దరూ కలసి నడవడం విశేషం. తమ ఇద్దరికీ కాకుండా మూడో వ్యక్తికి టికెట్ దక్కడం వారికి కష్టంగా మారింది. అందుకే ఆ ఇద్దరూ కలసి ఎమ్మెల్సీ కవితను కలిశారు. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో.. తమ ఇద్దరిలో ఒకరికి ఆ ఛాన్స్ వచ్చేలా అభ్యర్థించారు. మరి ఈ పంచాయితీ లెక్కలేంటో రేపటితో తేలిపోతుంది.