లోక్‌సభ ఎన్నికలు.. BRSకు పెద్ద సవాల్!
2019 ఎన్నికల్లోనే బీఆర్ఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్‌కు.. తర్వాత కొద్ది నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్‌కు.. లోక్‌సభ ఎన్నికల రూపంలో మరో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నడిచింది. బీజేపీ కొన్ని స్థానాల్లో గెలిచినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన పోటీ అంతంత మాత్రమే. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అలా కాదు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా రేసులో ఉన్నాయి. దీంతో ట్రయాంగిల్ పోటీ తప్పని పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొవాలి. జాతీయ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న కేసీఆర్‌కు ఈ పార్లమెంట్ ఎన్నికలు పెద్ద సవాల్. టీఆర్ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఎదుర్కొంటున్న మొదటి లోక్‌సభ ఎన్నికలు ఇవే. కాంగ్రెస్, బీజేపీలను దాటి మెజార్టీ స్థానాలు సాధించాలంటే ఈసారి అంత ఈజీ కాదు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు వేర్వేరుగా ఉంటాయి. జాతీయ అంశాలతో పాటు ప్రధాని ఎవరనే అంశమే పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా ఉంటుంది.
2019 ఎన్నికల్లోనే బీఆర్ఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్‌కు.. తర్వాత కొద్ది నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. టీఆర్ఎస్ కంచుకోటగా పేరున్న ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడు పార్లమెంట్ స్థానాలను సొంతం చేసుకుని బీజేపీ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక కాంగ్రెస్ సైతం నల్గొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి స్థానాల్లో విజయం సాధించింది.
ఇప్పటివరకూ మూడు స్థానాల్లో అభ్యర్థులపై మాత్రమే గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. కరీంనగర్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయి. మిగిలిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగుతోంది. నిజామాబాద్‌లో కవిత పోటీ ఖాయమే అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆదిలాబాద్‌లో గతంలో ఎంపీగా పని చేసిన గొడెం నగేష్ ఇప్పుడు అంతగా యాక్టివ్‌గా లేరు. వరంగల్ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌కు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశాలు దాదాపు కనిపించట్లేదు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవితకు అవకాశం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి.
ఇక భువనగిరి నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ఇప్పుడు బీజేపీ గూటికి చేరారు. పెద్దపల్లి, నాగర్‌కర్నూలు స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నప్పటికీ.. సిట్టింగ్‌లకు మరో అవకాశం ఇస్తారా.. లేదా.. అనేది సస్పెన్స్‌గా మారింది. వీటితో పాటు నల్గొండ, మల్కాజిగిరి, సికింద్రాబాద్ అభ్యర్థులెవరనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.