Telugu Global
Telangana

యాదాద్రి వర్సెస్ అయోధ్య.. పోలిక చెప్పిన అఖిలేష్

అయోధ్యలోని రామమందిరం నిర్మాణంపై అఖిలేష్ సెటైర్లు వేశారు. మందిర నిర్మాణం పూర్తి కాకముందే బీజేపీ బిల్డప్ లు భరించలేకపోతున్నామని పరోక్షంగా చురకలంటించారు.

యాదాద్రి వర్సెస్ అయోధ్య.. పోలిక చెప్పిన అఖిలేష్
X

ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ముందు నాలుగు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం.. కొత్తగా నిర్మించిన భవనాలు, ప్రాకారాలు చూసి ఇతర రాష్ట్రాల నేతలు ఆశ్చర్యపోయారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఆ నిర్మాణాన్ని చూసి అబ్బురపడ్డారు. యాదాద్రి ఆల‌య నిర్మాణాన్ని ప్రశంసించిన అఖిలేష్, విష్ణుమూర్తి అవ‌తార‌మైన న‌రసింహ స్వామి ఆల‌యాన్ని అద్భుతంగా పున‌ర్నిర్మించార‌ని కొనియాడారు. ఇంత చేసినా ఆ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదన్నారు అఖిలేష్. కానీ కొంద‌రు ఆల‌యం కట్టకముందే.. దాని గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారని బీజేపీపై విమర్శలు సంధించారు. అయోధ్యలోని రామమందిరం నిర్మాణంపై అఖిలేష్ సెటైర్లు వేశారు. మందిర నిర్మాణం పూర్తి కాకముందే బీజేపీ బిల్డప్ లు భరించలేకపోతున్నామని పరోక్షంగా చురకలంటించారు. అదే సమయంలో అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిన కేసీఆర్ సర్కారు మాత్రం ప్రచారానికి దూరంగా ఉండటం విశేషమని అన్నారు.


బీజేపీ కౌంట్ డౌన్ స్టార్ట్..

కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇక మిగిలింది కేవలం 399 రోజులేనని అన్నారు అఖిలేష్ యాదవ్. ఆ పార్టీ కౌంట్‌ డౌన్ మొదలైందని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్‌ లో మాట్లాడిన అఖిలేష్.. అశేష జనవాహిణి ముందు తాను సందేశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అవకాశం ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ స‌భ‌కు వ‌చ్చిన జ‌న‌మే దేశంలోని మార్పుకి సంకేతం అని అన్నారు.

సమీకృత కలెక్టరేట్ లు భేష్..

తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం ప్రజా సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు అఖిలేష్ యాదవ్. తెలంగాణ‌లో మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం అద్భుత‌మ‌ని ప్రశంసించారు. తెలంగాణ ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతోందని అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని, విపక్ష పార్టీల నేతలను కేసుల పేరుతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది, దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాది నుంచి మొదలైన ఈ ఉద్యమం.. సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. కలిసి పనిచేస్తే దేశానికి కొత్త మార్గదర్శకత్వం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలోని అన్ని సంస్థల‌ను బీజేపీ నిర్వీర్యం చేస్తోంద‌ని, ఢిల్లీలో కూర్చోని ఒక్కొక్క రాష్ట్రాన్ని నాశ‌నం చేయాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు అఖిలేష్ యాదవ్. రైతుల డిమాండ్లను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని, రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి విఫలమైందని అన్నారు. తెలంగాణలో బీజేపీకి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు, యూపీ నుంచి కూడా ఆ పార్టీని వెళ్లగొడతామ‌న్నారు.

First Published:  18 Jan 2023 8:46 PM IST
Next Story