Telugu Global
Telangana

టీ.బీజేపీలో కనిపించని జోష్‌.. ప్రచారమేది..?

టీ.బీజేపీలో కనిపించని జోష్‌.. ప్రచారమేది..?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పోలింగ్‌కు మరో 30 రోజులు మాత్రమే టైమ్‌ ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్‌ నేతలు ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌ సైతం స్పీడ్ పెంచింది. కానీ, తెలంగాణ బీజేపీలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. ఆ పార్టీలో ఎన్నికల జోష్‌ ఏ మాత్రం కనిపించడం లేదు. నేతల హడావిడి సైతం పెద్దగా లేదు.

ఇప్పటివరకూ మొదటి విడతలో 52, రెండో విడతలో ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగతా స్థానాల్లో అభ్యర్థుల కోసం తర్జనభర్జనలు ప‌డుతోంది. ఇక మేనిఫెస్టో సంగతి మాట్లాడకుంటేనే మంచిది. ఆ దిశగా పార్టీలో ఎలాంటి కసరత్తు జరుగుతున్నట్లు కూడా కనిపించట్లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఎలాగూ లేకపోవడంతో ప్రచారంపై కమలనాథులు పెద్దగా దృష్టి పెట్టట్లేదని సమాచారం. కేవలం ఢిల్లీ పెద్దలు వస్తే ఒకటి, రెండు బహిరంగ సభలు నిర్వహించి మమ అనిపించేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లోనూ మునుపటి ఉత్సాహం లేదు. నేతలతో పాటు పార్టీ కార్యకర్తలంతా డీలా పడిపోయారు.

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న టైమ్‌లో రెండు ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పాటు GHMCలో బీఆర్‌ఎస్‌కు దీటుగా సీట్లు సాధించింది. ఓ దశలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు ప్రమాదంగా మారింది. అయితే బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో సీన్‌ ఒక్కసారిగా రివర్స్ అయింది. రాకెట్ వేగంతో ఎదిగిన బీజేపీ.. అంతే వేగంతో మళ్లీ కింద‌కు పడిపోయింది. దీంతో చాలా మంది నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరికొంత మంది నేతలు పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి.

ఇక ఢిల్లీ పెద్దలకు సైతం తెలంగాణపై పెద్దగా ఆశలు లేవు. దీంతో వారు ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛ‌త్తీస్‌గఢ్‌పై ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణలో ఏదో నామమాత్రంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ ప్రారంభంలో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సభలు నిర్వహించినప్పటికీ.. ప్రజలను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. ప్రస్తుతం తెలంగాణలో గెలిచే అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో హంగ్‌ అసెంబ్లీపైనే ఆశలు పెట్టుకుంది బీజేపీ. తెలంగాణ వ్యాప్తంగా 5 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశముందని సర్వేలు చెప్తున్నాయి.

First Published:  31 Oct 2023 9:16 AM IST
Next Story