Telugu Global
Telangana

సెకండ్ లిస్ట్ చిచ్చు.. గాంధీ భవన్ లో రచ్చ

ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత గాంధీ భవన్ పైకి నేతలు దండెత్తారు కానీ, తాళాలు వేయడంతో వెనక్కి వెళ్లిపోయారు. సెకండ్ లిస్ట్ తర్వాత ఏకంగా రాళ్లదాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు.

సెకండ్ లిస్ట్ చిచ్చు.. గాంధీ భవన్ లో రచ్చ
X

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కంటే సెకండ్ లిస్ట్ ఎక్కువ గొడవలకు కారణం అవుతోంది. అసంతృప్తుల నిరసనలు, ప్రెస్ మీట్లలో ఆశావహుల కంటతడి, చివరకు గాంధీ భవన్ లో పగిలిన అద్దాలు.. ఇలా సాగుతోందీ వ్యవహారం. జూబ్లీహిల్స్‌ టికెట్ ఆశించి భంగపడిన పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లను అమ్ముకున్నాడని ఆరోపించారు. ఈ గొడవ జరుగుతుందని ముందే ఊహించిన గాంధీ భవన్ సిబ్బంది లోపలి గేట్లను మూసివేశారు. అయితే పార్టీ జెండాలను విష్ణువర్ధన్‌ రెడ్డి అనుచరులు తగులబెట్టారు. ఇటుకలు, రాళ్లను కార్యాలయంపైకి విసిరారు. రేవంత్ రెడ్డి ఫొటోలు ప్రింట్ చేసి ఉన్న అద్దాలను పగలగొట్టారు.


ఆగ్రహ జ్వాలలు..

శేరిలింగంపల్లి నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన జైపాల్‌ యాదవ్‌ మనస్థాపానికి గురయ్యారు. ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. పార్టీ తనను మోసం చేసిందని.. త్వరలోనే పార్టీ మారతానని ప్రకటించారు. కూకట్‌ పల్లి నియోజకవర్గంలో టికెట్‌ ఆశించి భంగపడిన గొట్టుముక్కల వెంగళరావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేశానని, వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తికి రాత్రికి రాత్రే కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్‌ ను కేటాయించారని అన్నారాయన. మునుగోడు టికెట్ తనకు రాకపోవడంతో పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ లో ముసలోల్ల హవా నడుస్తోందని ఎద్దేవా చేశారాయన.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. ముధోల్ టికెట్ లభించకపోవడంతో సీనియర్ నాయకుడు విజయకుమార్ రెడ్డి పార్టీ జెండాలు, కండువాలు, ఫ్లెక్లీలను తగలబెట్టారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో టికెట్ రాకపోవడంతో ప్యారాచ్యూట్ హాటావో అంటూ టికెట్ రాని నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ.. మర్సుకోల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్యాం నాయక్ కు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో స్థానికులకే టికెట్ ఇవ్వాలని ఓ వర్గం నాయకులు డిమాండ్ చేశారు. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లిస్ట్ కూడా చిచ్చు పెట్టింది. ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత గాంధీ భవన్ పైకి నేతలు దండెత్తారు కానీ, తాళాలు వేయడంతో వెనక్కి వెళ్లిపోయారు. సెకండ్ లిస్ట్ తర్వాత ఏకంగా రాళ్లదాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు.

First Published:  28 Oct 2023 8:31 PM IST
Next Story