Telugu Global
Telangana

ఐక్యతే మన బలం.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలంతో పాటు సీఎం కేసీఆర్ చరిష్మా కూడా రాబోయే ఎన్నికల్లో మరోసారి కలిసి రానున్నది.

ఐక్యతే మన బలం.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇన్నాళ్లూ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. దాదాపు 300 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలంతో పాటు సీఎం కేసీఆర్ చరిష్మా కూడా రాబోయే ఎన్నికల్లో మరోసారి కలిసి రానున్నది. వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉండటం సహజమే. కానీ అది ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఉంచాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నాయకులదే. అందుకే పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఐక్యంగా ఉంటే పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. పార్టీలో ఉండే చిన్నచిన్న లోటు పాట్లను సరిదిద్దుకొని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఐక్యమత్యంగా ఉండి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కేసీఆర్ కోరుకుంటున్నారు.

మహారాష్ట్రలో మంచి స్పందన వస్తోందని.. తెలంగాణలో మరో సారి అధికారం దక్కించుకుంటే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పెట్టుకున్న లక్ష్యాన్ని తప్పకుండా అందుకుంటామని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం రోజు భారీ సభ నిర్వహించాలని భావించినా.. ఇతర కార్యక్రమాల దృష్ట్యా కేవలం ప్రతినిధుల సభకే పరిమితం చేశారు. త్వరలోనే వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని గతంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

27 నిర్వహించే ప్రతినిధుల సభలో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి.. నాయకులు, కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి అనే విషయాలను సీఎం కేసీఆర్ వెల్లడించనున్నారు. సోషల్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకతపై కూడా కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రతినిధుల సభ.. అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావంలా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు తోడు.. కొత్త పథకాలు ఏమైనా తీసుకొని రావాలా? ప్రస్తుతం ఉన్న పథకాలను మరింత విస్తృతంగా ఎలా అమలు చేయాలనే విషయాలపై కూడా చర్చ జరుగనున్నది. అలాగే పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, వాటిపై విస్తృతంగా చర్చిస్తారని.. అనంతరం ఆమోదిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై కూడా తీర్మానం చేయనున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి గురువారం నాటి ప్రతినిధుల సభలో కొన్ని కీలకమైన నిర్ణయాలను సీఎం కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

First Published:  26 April 2023 10:17 AM GMT
Next Story