Telugu Global
Telangana

తెలంగాణ‌లో కొత్త‌గా 3 ఎయిర్‌పోర్టుల‌కే అవ‌కాశం.. - కేంద్ర పౌర విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి వీకే సింగ్‌

వ‌రంగ‌ల్ (బ్రౌన్ ఫీల్డ్‌), ఆదిలాబాద్ (బ్రౌన్ ఫీల్డ్‌), జ‌క్రాన్‌ప‌ల్లి (గ్రీన్ ఫీల్డ్‌) ప్రాంతాలు మాత్ర‌మే విమానాశ్ర‌య నిర్మాణానికి సాంకేతికంగా సాధ్య‌మ‌వుతాయ‌ని ఏఏఐ త‌న నివేదిక‌లో పేర్కొంది.

తెలంగాణ‌లో కొత్త‌గా 3 ఎయిర్‌పోర్టుల‌కే అవ‌కాశం.. - కేంద్ర పౌర విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి వీకే సింగ్‌
X

తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు మాత్ర‌మే కొత్త‌గా విమానాశ్ర‌యాల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం గురువారం తెలిపింది. రాష్ట్రంలో ఆరు విమానాశ్ర‌యాలు నిర్మించాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌పై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధ్య‌య‌నం అనంత‌రం కేంద్రం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

వ‌రంగ‌ల్ (బ్రౌన్ ఫీల్డ్‌), ఆదిలాబాద్ (బ్రౌన్ ఫీల్డ్‌), జ‌క్రాన్‌ప‌ల్లి (గ్రీన్ ఫీల్డ్‌) ప్రాంతాలు మాత్ర‌మే విమానాశ్ర‌య నిర్మాణానికి సాంకేతికంగా సాధ్య‌మ‌వుతాయ‌ని ఏఏఐ త‌న నివేదిక‌లో పేర్కొంది. త‌క్ష‌ణ భూసేక‌ర‌ణ అవ‌స‌రాన్ని నివారించ‌డానికి చిన్న విమానాల ప్రైవేటు కార్య‌క‌లాపాల కోసం ఈ మూడు ప్రాంతాల్లో సాధ్య‌మ‌య్యే స్థ‌లాల‌ను అభివృద్ధి చేసి.. ప్రారంభించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఏఏఐ కోరింద‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌ నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు మాలోత్ క‌విత‌, వెంక‌టేశ్ నేత‌, రంజిత్‌రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న సమాధాన‌మిచ్చారు.

హైద‌రాబాద్‌లో రాజీవ్ గాంధీ జాతీయ ఏవియేష‌న్ వ‌ర్సిటీ క్యాంప‌స్ ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి 2018లో వ‌చ్చిందని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. అయితే.. ఆర్‌జీఎన్ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించ‌లేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి వీకేసింగ్ ఈ మేర‌కు బ‌దులిచ్చారు.

First Published:  3 Feb 2023 11:00 AM IST
Next Story