Telugu Global
Telangana

తెలంగాణలో బుల్డోజర్లు.. రెచ్చగొట్టిన సాధ్వి..

తెలంగాణలో కూడా జోరుగా మతమార్పిడిలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి సాధ్వి. బీజేపీ మతతత్వ పార్టీ అయితే, ఎంఐఎం కూడా మతతత్వ పార్టీయేకదా అని ప్రశ్నించారు.

తెలంగాణలో బుల్డోజర్లు.. రెచ్చగొట్టిన సాధ్వి..
X

భారత్‌లో ప్రజాస్వామ్యం కాదు బుల్డోజర్ స్వామ్యం నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఓ క్రెడిట్‌గా చెప్పుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణకి కూడా బుల్డోజర్లు పంపిస్తున్నామని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజ్ జ్యోతి. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కలకలం రేపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, దోపిడీదారుల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామని హెచ్చరించారు సాధ్వి.

ఇలాంటి వ్యాఖ్యల కోసమే సాధ్విని ఈసారి ఏరికోరి ఎంపిక చేసి తెలంగాణకు పంపించారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కలకలం సృష్టించాలనేది బీజేపీ ఆలోచన. అందుకే బుల్డోజర్లు అనే మాట తెరపైకి తెచ్చారు. అంతే కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలకు కూడా ఈ ముగింపు యాత్ర వేదికగా మారింది. పీఎఫ్ఐ పేరు చెబితే కొంతమంది మండిపడుతున్నారని, తెలంగాణలో కూడా జోరుగా మతమార్పిడిలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు మంత్రి సాధ్వి. బీజేపీ మతతత్వ పార్టీ అయితే, ఎంఐఎం కూడా మతతత్వ పార్టీయేకదా అని ప్రశ్నించారు సాధ్వి. భారత్‌ను ముక్కలు చేయాలనుకుంటున్న వారెవరో అందరికీ తెలుసన్నారు. మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలు ఒకటి అవుతున్నాయని అన్నారామె.

రాహుల్‌ గాంధీపై కూడా నిప్పులు చెరిగారు సాధ్వి. రాహుల్ చేసేది భారత్ జోడో యాత్ర కాదని అది, భారత్ చోడో యాత్ర అని అన్నారు. ఇదే ఆయనకు చివరి పాదయాత్ర అని, ఆ తర్వాత రాహుల్ వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోవాల్సిందేనని చెప్పారు. ప్రధాని కావాలని కలలు కనేవారంతా ఎన్నికల తర్వాత గొడవలు పడతారని, అంతకు మించి కూటముల వల్ల ఉపయోగం ఏదీ లేదన్నారు.

First Published:  23 Sept 2022 8:54 AM IST
Next Story