తెలంగాణలో యాసంగి ధాన్యంపై క్లారిటీ.. ఫలించిన ప్రభుత్వ పోరాటం
తెలంగాణ రైతుల నుంచి ధాన్యం, బియ్యాన్ని సేకరించేందుకు ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రులిద్దరూ వెల్లడించారు.
తెలంగాణలో రైతులు పండించిన యాసంగి పంటపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. యాసంగి ధాన్యం, బియ్యం కొనుగోళ్లపై కేంద్ర పౌర సరఫరాల శాఖ వివరణ ఇచ్చింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. వారి డిమాండ్లను మంత్రి పీయుష్ గోయల్ అంగీకరించడం గమనార్హం.
తెలంగాణలో ధాన్యం సేకరణకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో మంత్రి పీయుష్ గోయల్, కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. అందుకే కేంద్రం నేరుగా ధాన్యంతో పాటు బియ్యాన్ని సేకరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తెలంగాణ రైతుల నుంచి ధాన్యం, బియ్యాన్ని సేకరించేందుకు ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రులిద్దరూ వెల్లడించారు. త్వరలోనే ఎఫ్‌సీఐ అధికారులు ధాన్యంతో పాటు బియ్యం సేకరిస్తారని వారు స్పష్టం చేశారు.
కాగా, గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం యాసంగి ధాన్యం, బియ్యం విషయంలో పోరాటం చేస్తోంది. సీఎం కేసీఆర్ ఏకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేసి.. బీజేపీ ప్రభుత్వపు విధానాలను ఎండగట్టారు. తెలంగాణ వ్యాప్తంగా యాసంగి ధాన్యంపై రైతు సంఘాలు కూడా పోరాటం చేశాయి. మొదటి నుంచి ధాన్యం సేకరణపై నోరు మెదపని కేంద్రం.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లకు అనుగుణంగా సేకరిస్తామని చెప్పడం గమనార్హం.