Telugu Global
Telangana

ఆ వాటా మాదే.. కేటీఆర్ ట్వీట్ పై కిషన్ రెడ్డి స్పందన..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గత ఎనిమిదేళ్లలో జాతీయ విపత్తుల నిర్వహణ కింద రూ.3వేల కోట్లు విడుదల చేసిందని చెబుతున్నారు కిషన్‌ రెడ్డి. 2018 నుంచి ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు.

ఆ వాటా మాదే.. కేటీఆర్ ట్వీట్ పై కిషన్ రెడ్డి స్పందన..
X

2018 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో వరదలొచ్చినా, వర్షాలతో ఇబ్బంది పడ్డా కేంద్రం చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదంటూ కేటీఆర్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎన్డీఆర్ఎఫ్ ఏ ఏడాది, ఏ రాష్ట్రానికి, ఎంత సాయం చేసిందో గణాంకాలతో సహా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇక్కడే చిన్న మతలబు ఉందని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నేరుగా సాయం చేయలేదు కానీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్) చేసిన సాయంలోనే కేంద్ర వాటా ఉందని కవర్ చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గత ఎనిమిదేళ్లలో జాతీయ విపత్తుల నిర్వహణ కింద రూ.3వేల కోట్లు విడుదల చేసిందని చెబుతున్నారు కిషన్‌ రెడ్డి. 2018 నుంచి ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణకు ఎలాంటి సాయం చేయలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు వాస్తవం కాదన్నారాయన. 2020-2021లో జీహెచ్‌ఎంసీ పరిధిలో వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి రూ.599 కోట్లు ఇచ్చిందని, అందులో కేంద్రం వాటా రూ.449 కోట్లు ఉందని చెబుతున్నారు కిషన్ రెడ్డి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ రూ.1500 కోట్లు ఉంటే అందులో రూ.1200 కోట్లు కేంద్ర వాటా అని చెప్పారు. 2021-22లో రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధికి మొత్తం కేటాయింపు రూ.479.20కోట్లు కాగా, ఇందులో కేంద్రం వాటా రూ.359.20కోట్లు అని స్పష్టం చేశారు.


అంటే ఎస్డీఆర్ఎఫ్ ఇస్తున్న నిధుల్లో కేంద్రం వాటా ఉందని అంటున్నారు కిషన్ రెడ్డి. అయితే ఈ విషయంలో కేటీఆర్ గతంలోనే కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న నిధులు ఎక్కువా, కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి చేస్తున్న ఆర్థిక సాయం ఎక్కువా తేల్చి చెప్పాలన్నారు. అప్పట్లో కేంద్రం నుంచి స్పందనే లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి చెబుతున్న లెక్కలు కూడా ఇలాంటివే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిలో తమకు వాటా ఉందని అంటున్నారు కిషన్ రెడ్డి. అయితే ఎన్డీఆర్ఎఫ్ నుంచి నేరుగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీ మొత్తంలో ఆర్థిక సాయం ఎందుకు వెళ్తుందో కిషన్ రెడ్డి చెప్పలేకపోయారు.

First Published:  20 July 2022 6:45 PM IST
Next Story