అందులో 3 లక్షలు మావే.. కిషన్ రెడ్డి లాజిక్
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మోరంచపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు ఉన్నాయని చెప్పారాయన.
వరదబీభత్సానికి వెంటనే తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 4లక్షల రూపాయలు, క్షతగాత్రులకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ నేపథ్యంలో ఈరోజు పరామర్శలకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బాధితులతో మాట్లాడారు. వరదల వల్ల నష్టపోయిన వారికి కేంద్రం సాయం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 లక్షల నష్టపరిహారంలో 3 లక్షల వాటా తమదేనంటూ ఆయన లాజిక్ చెప్పారు.
మోరంచపల్లిలో కిషన్ రెడ్డి..
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మోరంచపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు ఉన్నాయని చెప్పారాయన. ఆ నిధులతో బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మృతులకు ఇచ్చే రూ.4 లక్షల ఎక్సిగ్రేషియాలో 75 శాతం(3 లక్షలు) కేంద్రం ఇచ్చివేనని తెలిపారు. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్లిష్టపరిస్థితిలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. బాధితులను కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని తెలిపారు. కేంద్ర బృందాలు వరదముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తాయని చెప్పారు,.
వరదల్లో గల్లంతైన వారి కుటుంబాలని పరామర్శించి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చాను. గల్లంతైన మృతదేహాల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించాను.
— G Kishan Reddy (@kishanreddybjp) July 30, 2023
పలువురు బాధిత కుటుంబాలను ఈ సందర్భంగా పరామర్శించాను. ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి అండగా ఉంటుందని… pic.twitter.com/OqJz2UzaBk
రేపు తెలంగాణకు కేంద్ర బృందం..
రేపు తెలంగాణకు కేంద్ర బృందం వచ్చి వరద నష్టం అంచనా వేస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో మొత్తం 8 శాఖల అధికారులతో తెలంగాణకు కేంద్ర బృందం వస్తుందని చెప్పారాయన. వారంతా వరద నష్టంపై అంచనాలను రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారని తెలిపారు. అంతా బాగానే ఉంది కానీ, కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎలాంటి సాయం చేస్తుందో కిషన్ రెడ్డి చెప్పకపోవడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. జాతీయ విపత్తు నిధి అనేది కేంద్రం దయతో ఇవ్వడం లేదని, రాష్ట్రాలు కట్టిన పన్నుల్లో కొంత ఇక్కడ పెట్టాల్సిన బాధ్యత వారికి ఉందని గుర్తు చేశారు. ఎన్నికల ఏడాదిలో కేంద్ర బృందం అంటూ హడావిడి చేస్తున్నారని, గతంలో వరదలు, వర్షాలు వచ్చినప్పుడు ఈ బృందాలు ఎక్కడికిపోయాయని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.