Telugu Global
Telangana

ఢిల్లీకి వస్తే చెక్కు రాసిచ్చేస్తారా..! రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి సెటైర్లు

ఢిల్లీకి వస్తే చెక్కులిచ్చేస్తారా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మరి నిధులివ్వాలంటే ఏం చేయాలో ఆయనే చెప్పాలని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఢిల్లీకి వస్తే చెక్కు రాసిచ్చేస్తారా..! రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి సెటైర్లు
X

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించారంటూ నిన్న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు రెండూ కేంద్ర బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశాయి. బీజేపీ ఎమ్మెల్యేలు కవర్ చేసుకోవాలని చూసినా ఫలితం లేదు. ఢిల్లీలో దీక్షకు దిగే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. చివరిగా ఈ ఎపిసోడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. "చచ్చుడో, నిధులు తెచ్చుడో" అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఢిల్లీకి వస్తే ఏంటి..?

"మూడుసార్లు ఢిల్లీకి వచ్చాను, ప్రధాని సహా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలిచ్చాను, అయినా కూడా తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు శూన్యం" అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి జవాబులు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీకి వస్తే చెక్కులిచ్చేస్తారా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మరి నిధులివ్వాలంటే ఏం చేయాలో ఆయనే చెప్పాలని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణకు కేటాయింపులు చేయకపోగా బుకాయింపులకు దిగడమేంటని మండిపడుతున్నారు.

తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులేవి..? అనే ప్రశ్నకు కిషన్ రెడ్డి సూటిగా సమాధానమివ్వలేదు. ఏపీకి కేటాయింపులు జరిగితే ఏడుపెందుకని తెలివిగా సమస్యను పక్కదారి పట్టించేశారాయన. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎదురుదాడికి దిగారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేక, పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తోందని అన్నారు. గతంలో కేసీఆర్ ఎలా వ్యవహరించారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే కేంద్రంపై తప్పులు నెడుతున్నారని అన్నారు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయలేకపోయినందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

First Published:  25 July 2024 1:58 AM GMT
Next Story