Telugu Global
Telangana

కాంగ్రెస్ దూకుడు తగ్గితేనే మునుగోడు ఉపఎన్నిక.. అమిత్ షా లెక్క అదేనా.!

మూడు నాలుగు రోజుల్లోగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ప్రతీ గ్రామంలో ముగ్గురితో కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమిటీలో ఓ రాష్ట్రస్థాయి నేతతో పాటు జిల్లా, గ్రామస్థాయి నేతలు ఉండాలని సూచించారు.

కాంగ్రెస్ దూకుడు తగ్గితేనే మునుగోడు ఉపఎన్నిక.. అమిత్ షా లెక్క అదేనా.!
X

బీజేపీ జాతీయ నాయకత్వం మునుగోడు ఉపఎన్నిక విషయంలో వేసిన లెక్కలు తప్పాయా? ద్విముఖ పోరుకు పరిమితం చేద్దామనుకున్న వ్యూహాలు పని చేయలేదా? అంటే శనివారం జరిగిన బీజేపీ సమావేశం తర్వాత అవుననే తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విమోచన దినోత్సవానికి వచ్చిన మంత్రి అమిత్ షా ఆ తర్వాత పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన విషయాలే కీలకంగా చర్చించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారకపోవడంపై ఆయన మండిపడినట్లు సమాచారం. ఉపఎన్నిక విషయంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌తో ఆయన మాట్లాడారు. మూడు నాలుగు రోజుల్లోగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ప్రతీ గ్రామంలో ముగ్గురితో కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమిటీలో ఓ రాష్ట్రస్థాయి నేతతో పాటు జిల్లా, గ్రామస్థాయి నేతలు ఉండాలని సూచించారు.

కాగా, వాస్తవానికి మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉండేలా జాతీయ నాయకత్వం వ్యూహం రచించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వచ్చే సమయంలో భారీగా కాంగ్రెస్ క్యాడర్‌ను బీజేపీలోకి తీసుకొని వస్తారని అంచనా వేసింది. ఆ తర్వాత ఇంకా ఎవరైనా కాంగ్రెస్‌లో మిగిలితే ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే లోపు బీజేపీలోకి లాగేయాలని అనుకున్నది. అలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడుతుందని.. అప్పుడు కేవలం బీజేపీ-టీఆర్ఎస్ పార్టీ ద్విముఖ పోరులా మారుతుందని అంచనా వేసింది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో ద్విముఖ పోరు వల్లే బీజేపీ గెలిచింది. రెండు చోట్లా కాంగ్రెస్‌కు బలం ఉన్నా.. ఆ పార్టీని పూర్తిగా సైడ్ చేయడంతో బీజేపీకి లాభించింది. మునుగోడులో కూడా అదే స్ట్రాటజీ అమలు చేయాలని భావించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేకుండా పోయింది.

కాంగ్రెస్ పార్టీకి మునుగోడులో మొదటి నుంచి పట్టుంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా.. కింది స్థాయి కేడర్ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఆ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోవడంతో పాటు.. హూజూరాబాద్‌లో చేసిన తప్పు చేయకూడదని అనుకున్నారు. అందుకే బీజేపీ అంచనా వేసినట్లుగా మునుగోడులో కాంగ్రెస్ బలహీనపడటం లేదు. ఈ క్రమంలోనే ఉపఎన్నికను కాస్త ఆలస్యంగా జరపాలని బీజేపీ అనుకుంటోంది. మునుగోడులో త్రిముఖ పోరు ఉంటే.. బీజేపీ గెలవదు. అదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుంది. అదే బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పోరులాగా చిత్రీకరించి బరిలోకి దిగితే.. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ అనే ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. అందుకే జాతీయ నాయకత్వం మునుగోడు విషయంలో రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నది.

కేంద్ర ఎన్నికల కమిషన్ తలుచుకుంటే అక్టోబర్‌లో ఉప‌ఎన్నిక పెట్టే అవకాశం ఉంది. కానీ బీజేపీ సూచనల మేరకే.. ఇంకా ఆ దిశగా ఎలాంటి కదలిక లేదని తెలుస్తోంది. అక్టోబర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుంది. అదే జరిగితే తమ అంచనాలు తలకిందులు అవుతాయి. కాబట్టి కాంగ్రెస్‌ను సైడ్ చేసే కార్యక్రమం పూర్తి చేసిన తర్వాతే మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధం చేయాలని బీజేపీ అనుకుంటోంది. అమిత్ షా ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు వేయడం ద్వారా వచ్చే వారం నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నది. అదే సమయంలో ప్రతీ గ్రామం నుంచి బీజేపీలోకి వలసలను ప్రోత్సహించాలని అనుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచే వలసలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అలా కాంగ్రెస్‌ దూకుడును తగ్గించి.. ఉపఎన్నికకు వెళ్లాలని అమిత్ షా కూడా అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి పొరపాటు జరగకూడదని.. మునుగోడులో కనుక మూడో స్థానానికి పడిపోతే అది మరింత ప్రమాదమని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. బీజేపీ బలపడుతూ.. కాంగ్రెస్‌ దూకుడును తగ్గించమే ఇప్పుడు మునుగోడు నాయకుల ముందు ఉన్న టార్గెట్. మరి అమిత్ షా వ్యూహాలను రాష్ట్ర నాయకత్వం ఏ మేరకు అమలు చేస్తుందో చూడాలి.

First Published:  18 Sept 2022 7:12 AM IST
Next Story