Telugu Global
Telangana

దళిత కార్యకర్త ఇంటిలో ఆర్థిక మంత్రి హాట్‌ బాక్స్ టిఫిన్

ఈ నేపథ్యంలో తెలంగాణలో దళితులను ఆకట్టుకునేందుకు కేంద్రమంత్రులు వచ్చిన ప్రతిసారి ఒక దళిత కార్యకర్త ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

దళిత కార్యకర్త ఇంటిలో ఆర్థిక మంత్రి హాట్‌ బాక్స్ టిఫిన్
X

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పర్యటన రసవత్తరంగా సాగింది. తెలంగాణలోని పథకాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తోందని దబాయించేందుకు కేంద్రమంత్రి ప్రయత్నించినా.. టీఆర్ఎస్‌ నుంచి ఊహించని స్థాయిలో వచ్చిన ప్రతిఘటనలో అది సాధ్యం కాలేదు. గణాంకాలతో మంత్రులు విరుచుకుపడ్డారు. ఒక విధంగా ఆర్థిక మంత్రి పర్యటన కారణంగా తెలంగాణకే కేంద్రం ఏ స్థాయిలో రుణపడి ఉందో ప్రజలకు వివరించేందుకు అవకాశం ఇచ్చిందని టీఆర్‌ఎస్ అభిప్రాయపడుతోంది.

తొలిరోజు నిర్మలా సీతారామన్‌ చేసిన విమర్శలన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయని హరీష్ రావు ఆధారాలతో సహా నిరూపించడంతో ఆమె తొలుత మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత తేరుకుని మరుసటి రోజు మీడియా సమావేశం పెట్టినా ఏ మీడియా సంస్థలైతే తనను ప్రశ్నిస్తాయో వాటి ప్రతినిధులను బయటకు పంపి మీడియా సమావేశం నిర్వహించారు. తాము విమర్శలు చేస్తాం గానీ.. తిరిగి ప్రశ్నిస్తే చెప్పేందుకు తమ వద్ద సమాధానాలు లేవని కేంద్ర మంత్రి పరోక్షంగా అంగీకరించినట్టు అయింది.

తొలి నుంచి కూడా బీజేపీపై దళితులు వ్యతిరేకంగానే ఉంటున్నారు. బీజేపీ భావజాలమే అందుకు కారణంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో దళితులను ఆకట్టుకునేందుకు కేంద్రమంత్రులు వచ్చిన ప్రతిసారి ఒక దళిత కార్యకర్త ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అమిత్ షా వచ్చినప్పుడు ఆయన కూడా ఒక దళిత కార్యకర్త ఇంటికి వెళ్లారు. కానీ భోజనం, కాఫీ, చివరకు మంచి నీళ్లు కూడా అక్కడ తాగకుండా వచ్చేశారు. బయటి నుంచి గ్రీన్ టీ తెచ్చుకుని తాగారు.

నిన్న నిర్మలా సీతారామన్‌ తీరు అంతే. నిజామాబాద్‌ జిల్లా కొడిచర్ల గ్రామంలో దళిత కార్యకర్త ఇంటికి ఆమె వెళ్లారు. కానీ దళిత కుటుంబం వండిన టిఫిన్ తినేందుకు ఆసక్తి చూపలేదు. బయటి నుంచి హాట్ బాక్స్‌లో ఇడ్లి, వడ, ఉప్మా తెప్పించుకున్నారు. ఆ టిఫిన్ కూడా ప్రత్యేకంగా పింగాణి ప్లేట్‌లో తిన్నారు. నిర్మలా సీతారామన్ ఇతర నేతల ఇళ్లకు వెళ్లిన సమయంలోనూ ఇదే తరహాలో బయటి నుంచి టిఫిన్ తెచ్చుకుని తింటారా అని నెటిజన్లు, టీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  4 Sept 2022 8:04 AM IST
Next Story