Telugu Global
Telangana

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్ట్ లకు మళ్లీ మొండి చెయ్యి..!!

వందే భారత్ లు మాకొద్దు, ఇంటర్ సిటీలు కావాలని అడుగుతున్నారు వారంతా. కానీ కేంద్రం కనికరించడంలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Union Budget 2023-24 for Telangana Railway Projects
X

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్ట్ లకు మళ్లీ మొండి చెయ్యి..!!

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో విదిలింపులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఈసారి కూడా తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో మొండిచెయ్యి చూపిస్తారనే అంచనాలున్నాయి. ముఖ్యంగా రైల్వేల అభివృద్ధిని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇటీవల వందే భారత్ పేరుతో పాత ప్రాజెక్ట్ లన్నీ అటకెక్కించేస్తోంది కేంద్రం. కొత్తగా వందే భారత్ రైలు ఇస్తున్నాం.. ఇంకేం అడగొద్దు అంటూ ముందుగానే హింట్ ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో పాత పథకాల విషయంలో కూడా ఇలాగే జరిగే అవకాశం కనిపిస్తోంది.

పన్నెండేళ్ల క్రితం ఎంఎంటీఎస్‌ రెండో దశ మొదలు పెట్టారు. ఇప్పటికీ అది పూర్తి కాలేదు. లింగంపల్లి నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు 6 కిలోమీటర్ల మేర అదనపు ట్రాక్ అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ వస్తోంది, పోతోంది, కానీ కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం గ్రీన్ సిగ్నల్ పడటంలేదు. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణ, స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులకు మాత్రమే కేంద్రం అనుమతిస్తోంది. నిధుల విడుదలకు మాత్రం అంగీకరించడంలేదు. కొత్త లైన్లు, కొత్త రైళ్లను పక్కనపెట్టేస్తోంది.

అన్నిటికీ వందేభారత్ ప్రత్యామ్నాయమేనా..?

కొత్త రైళ్లు కావాలని అడిగితే వందే భారత్ ఇస్తామంటోంది కేంద్రం. మరి ప్యాసింజర్లు, చిన్న చిన్న పట్టణాల్లో ఆగే ఎక్స్ ప్రెస్ లు ఎందుకివ్వరు..? సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. వందేభారత్‌ లో వరంగల్ వెళ్లాలంటే 450 రూపాయలు చార్జి.


ఇలాంటి రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే వారికి ఉపయోగం కానీ, మధ్యలో స్టేషన్లు ఉండీ ప్రయోజనం లేదు. వందే భారత్ లు మాకొద్దు, ఇంటర్ సిటీలు కావాలని అడుగుతున్నారు వారంతా. కానీ కేంద్రం కనికరించడంలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యులకు ముఖ్యమైన ఇంటర్‌ సిటీ, ప్యాసింజర్‌ రైళ్లను ఈ బడ్జెట్‌ లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఎంఎంటీఎస్‌ మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.


12 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్‌ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. 6 మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్లు మాత్రం పూర్తయ్యాయి. ఆ లైన్లు కూడా నడిపేందుకు ట్రైన్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌ కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

First Published:  24 Jan 2023 7:34 AM GMT
Next Story