బండి సంజయ్‌కి ఊహించని షాక్
ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ విఫలం అయ్యారని విమర్శించారు తిరుగుబాటు నేతలు. బండి సంజయ్ ఒక్కడికే అన్ని అవకాశాలు ఇస్తున్నారని, అయినా పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ కమలం పార్టీలో కలకలం రేగింది. ఎంపీ బండి సంజయ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్లు బండిపై తిరుగుబాటుకు దిగారు. గురువారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సంజయ్‌కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో దాదాపు 100మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బండికి ఎంపీ సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. తమలో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాలని తీర్మానం చేశారు.
ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ విఫలం అయ్యారని విమర్శించారు తిరుగుబాటు నేతలు. బండి సంజయ్ ఒక్కడికే అన్ని అవకాశాలు ఇస్తున్నారని, అయినా పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచేవారని, బండి వచ్చాక అది కూడా లేదన్నారు. విద్యాసాగర్‌రావు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచిన విషయాన్ని వాళ్లు గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న వారిని బండి పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి ఒంటెద్దు పోకడలతో విసిగిపోయామన్నారు. బండి తీరుపై కేంద్ర నాయకత్వంతో పాటు RSS దృష్టి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
బీజేపీ సీనియర్లు రెండేళ్ల కిందట కూడా ఇలాగే సమావేశమై బండిపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఆ సమయంలో బండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని అధిష్టానాన్ని కోరారు. కానీ, అధిష్టానం సీనియర్లపైనే రివర్స్ అయింది. గతంలో గుజ్జుల రామకృష్ణారెడ్డి ఇంట్లో సమావేశమైన ఈటల రాజేందర్, మురళీధర్‌రావులు బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం ఉంది. పార్టీలో కుంపట్లతో ఇప్పటికే అధ్యక్ష పదవి పోగొట్టుకున్న బండి సంజయ్.. ఎంపీ సీటును కూడా కోల్పోబోతున్నారా అనే చర్చ నడుస్తోంది.