Telugu Global
Telangana

వార్డు మెంబ‌ర్ కూడా కాకుండానే నేరుగా రాజ్య‌స‌భ‌కు..

2013లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన అనిల్ విద్యార్థి ద‌శ నుంచే కాంగ్రెస్‌తో క‌లిసి అడుగులేశారు.

వార్డు మెంబ‌ర్ కూడా కాకుండానే నేరుగా రాజ్య‌స‌భ‌కు..
X

తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ఇద్ద‌రిలో రేణుకా చౌద‌రి పార్టీప‌రంగానూ, ప‌ద‌వుల ప‌రంగానూ ఎంత సీనియ‌రో.. మ‌రో అభ్య‌ర్థి అనిల్ కుమార్ యాద‌వ్ అంత‌ జూనియ‌ర్‌. ఒక‌ర‌కంగా అనిల్‌కుమార్ అనూహ్యంగా అంద‌లం ఎక్కిన‌ట్లే. మాజీ ఎంపీ అంజ‌న్‌కుమార్ యాద‌వ్ కుమారుడైన అనిల్ కుమార్ యాద‌వ్‌ను రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన‌ట్లు కాంగ్రెస్ హైక‌మాండ్ తాజాగా ప్ర‌క‌టించింది.

ఎల్ఎల్‌బీ చ‌దివి, యూత్ కాంగ్రెస్ రాజ‌కీయాల్లోకి..

2013లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన అనిల్ విద్యార్థి ద‌శ నుంచే కాంగ్రెస్‌తో క‌లిసి అడుగులేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఉపాధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. త‌ర్వాత యువ‌జ‌న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడ‌య్యారు. ప్ర‌స్తుతం యువ‌జ‌న కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి

అయితే అనిల్ కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌లేదు. 2018లో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్య‌ర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టారు. ఈ నేప‌థ్యంలో పార్టీ ఏకంగా ఆయ‌న‌కు రాజ్య‌స‌భ టికెట్ ఇచ్చింది. దీంతో వార్డు స‌భ్యుడిగా కూడా గెల‌వ‌ని అనిల్ కుమార్ యాద‌వ్ నేరుగా రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునే ల‌క్ష్యంతోనే కాంగ్రెస్ ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపుతోంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

First Published:  14 Feb 2024 8:10 PM IST
Next Story