Telugu Global
Telangana

ఏడాది పాలనలో ఊహకందని అభివృద్ధి, సంక్షేమం

వాటిని చాటిచెప్పేలా ఈనెల 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు విజయోత్సవాలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

ఏడాది పాలనలో ఊహకందని అభివృద్ధి, సంక్షేమం
X

ఏడాది పాలనలోనే దేశంలోని ఇంకే రాష్ట్రం చేపట్టలేని.. ఎన్నో విప్లవాత్మకమైన ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వాటిని చాటిచెప్పేలా ఈనెల 14 నుంచి డిసెంబర్‌ 9వ తేదీ వరకు విజయోత్సవాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను షో కేస్‌ చేస్తూ.. ప్రభుత్వ విజన్‌ తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహిస్తామన్నారు. విజయోత్సవాల నిర్వహణపై శనివారం సెక్రటేరియట్‌ లో ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ మీటింగ్‌ భట్టి మాట్లాడుతూ, 26 రోజుల ఉత్సవాల్లో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ, ఇందిర మహళా శక్తి కార్యక్రమాలపై ప్రజలను చైతన్య పరుస్తామన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రూ.18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో పాటు స్వశక్తి మహిళలకు రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. మూతపడ్డ కమలాపూర్‌ రేయన్స్‌ పరిశ్రమను రూ.4 వేల కోట్లతో పునరుద్దరించబోతున్నామన్నారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి రోజున ప్రారంభమయ్యే విజయోత్సవాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చివరి రోజు డిసెంబర్‌ 9న హైదరాబాద్‌ లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్‌ షో, క్రాకర్స్‌ ప్రదర్శన తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. వియోజత్సవాల మధ్యలోనే గ్రూప్‌ -4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేస్తామన్నారు. పలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోవడం, స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి ఫౌండేషన్‌, 16 నర్సింగ్‌ కళాశాలలు, 28 పారా మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవం, ఉస్మానియా హాస్పిటిల్‌ కొత్త బిల్డింగ్‌ కు శంకుస్థాపన, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, సాహిత్య అకాడమీ చైర్‌ పర్సన్‌ అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్‌, స్పెషల్‌ సీఎస్‌ జయేశ్‌ రంజన్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు రవి గుప్త, క్రిస్టినా జోంగ్తు, ఎం. శ్రీధర్‌, సెక్రటరీలు దాసరి హరిచందన, లోకేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  9 Nov 2024 3:15 PM IST
Next Story