Telugu Global
Telangana

ఈటల ఫొటో లేకుండా నిరుద్యోగ ర్యాలీ.. విచిత్రమైన కారణం చెప్పిన బీజేపీ!

సునిల్ బన్సల్ రాష్ట్ర నాయకులకు అంత క్లాస్ తీసుకున్నా.. వారం తిరిగే సరికి మరో సారి విభేదాలు బయటపడ్డాయి.

ఈటల ఫొటో లేకుండా నిరుద్యోగ ర్యాలీ.. విచిత్రమైన కారణం చెప్పిన బీజేపీ!
X

తెలంగాణ బీజేపీ నాయకత్వం వర్గ విభేదాలను పక్కన పెట్టాలని అధిష్టానం ఎన్నిసార్లు సూచించినా రాష్ట్ర నాయకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ గత వారంలో హైదరాబాద్ వచ్చినప్పుడు.. రాష్ట్ర నాయకులందరికీ గట్టి హెచ్చరికలే చేశారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నాయకులు విభేదాలు వీడి ఐక్యంగా పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర నాయకత్వం వర్గాలుగా విడిపోతే ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమవుతుందని కూడా సూచించారు.

సునిల్ బన్సల్ రాష్ట్ర నాయకులకు అంత క్లాస్ తీసుకున్నా.. వారం తిరిగే సరికి మరో సారి విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మధ్య ఇంకా విభేదాలు సమసిపోలేదని స్పష్టమైంది. ఖమ్మంలో శనివారం నిర్వహించిన నిరుద్యోగ ర్యాలీలో అంతా తానై నడిపించారు బండి సంజయ్. ఆ ర్యాలీ ముగింపు వేదికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, డీకే అరుణ వంటి నాయకుల ఫొటోలు ఉన్నాయి. కానీ ఎక్కడా చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఫొటో లేదు. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

నిరుద్యోగ ర్యాలీలో ఈటల రాజేందర్ ఫొటో ఎందుకు లేదని ఆరా తీయగా.. బీజేపీ నాయకులు విచిత్రమైన కారణం చెబుతున్నారు. ఈటల రాజేందర్‌కు ఇచ్చిన చేరికల కమిటీ చైర్మన్ పదవికి ఎలాంటి ప్రోటోకాల్ లేదని అన్నారు. చేరికల కమిటీ చైర్మన్ అనేది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పదవే కానీ.. పార్టీ పరంగా ఎలాంటి ప్రోటోకాల్ లేకపోవడంతోనే ఫొటోలు వేయలేదని చెప్పారు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఆయనకు ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా.. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఈటల కూడా ఒకరు. ఎంపీల ఫొటోలు వేసిన బీజేపీ.. ఎమ్మెల్యేలను ఎందుకు వదిలేసిందనే అనుమానం కలుగుతోంది.

బీజేపీ ఎమ్మెల్యేలలో ఈటల, రఘునందర్ రావు కొత్తగా పార్టీలో చేరిన వారే. వీరిద్దరూ బండి సంజయ్ వ్యతిరేక వర్గంగా పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇక రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. కాబట్టే ముగ్గురి ఫొటోలను పక్కన పెట్టిందని పార్టీలో చర్చ జరుగుతోంది. అధిష్టానం ఎంత చెప్పినా పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలు తగ్గడం లేదని.. ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడం కష్టంగా మారిందని తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అని బీజేపీ నాయకులు పదే పదే చెబుతున్నా.. ఇప్పటికీ నాయకులు ఎవరికి వారే అనే చందంగా వ్యవహరించడం కార్యక్తలను గందరగోళంలో పడేస్తోంది. ఇలాగైతే పార్టీ ఎలా ఎన్నికలను ఎదుర్కుంటుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  28 May 2023 9:49 AM IST
Next Story