బీజేపీలో ఉండలేక.. వెళ్లలేక.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిప్పలు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోని ఒక వర్గం నాయకులు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉపఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బయట పెద్దగా కనిపించలేదు. తాజాగా రెండు రోజుల నుంచి ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వచ్చాయి. కాగా, దీనిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి తాను పార్టీని వీడటం లేదని చెప్పుకొచ్చారు. మరోసారి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. అదే సమయంలో తనను తిరిగి పార్టీలోకి రావాలని కొంత మంది స్నేహితులు కోరినట్లు అసలు విషయం బయటపెట్టారు. రాజగోపాల్ రెడ్డి మాటలు చూస్తే.. ఆయన పూర్తి డైలమాలో ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోని ఒక వర్గం నాయకులు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ కలిగిన నాయకులు తప్ప కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు.. బీజేపీ విధానాలకు అలవాటు కాలేక పోతున్నారు. ఈటల రాజేందర్ ఏకంగా ఢిల్లీ వెళ్లి తన అసంతృప్తిని పార్టీ అధిష్టానం ముందు వెళ్లగక్కారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీని వీడతారనే వార్తలు బయటకు వచ్చాయి.
రాజగోపాల్ రెడ్డి తనపై పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి వేసినా.. ఆయన కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలో కొనసాగడంపై పునరాలోచిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దక్షిణాదిలో.. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ గెలవడం అసాధ్యమనే నిర్ణయానికి కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చినట్లు తెలుస్తున్నది. సన్నిహితుల వద్ద కూడా బీజేపీలో కొనసాగే విషయంపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీ కంటే కాంగ్రెస్‌లో ఉంటేనే మరోసారి గెలవడం సాధ్యం అవుతుందని అంచనాకు వచ్చారు.
నల్గొండలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీల్లోకి వెళ్లిన వారంతా త్వరలోనే సొంత గూటికి వస్తారని ఆయన అన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం ఖాయమనే వార్తలకు బలం చేకూరింది. త్వరలోనే వెంకటరెడ్డి స్వయంగా అధిష్టానం వద్దకు వెళ్లి తమ్ముడు పునరాగమనంపై అనుమతి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వం చాలా అవసరమని పలువురు సీనియర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావాలని ఉన్నా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మళ్లీ పని చేయడంపైనే ఆలోచిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై మరోసారి రాజగోపాల్ విరుచుకపడ్డారు. ఆయన పీసీసీగా ఉంటే పని చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీని వీడితే వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని రాజగోపాల్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పలు కాంట్రాక్టులు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన సంస్థలు చేపట్టాయి. ఇప్పుడు పార్టీని వీడితే వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుంచి బయటపడాలని ఉన్నా.. పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలించడం లేదనే చర్చ జరుగుతున్నది.