Telugu Global
Telangana

హైద‌రాబాద్ క్యాబ్స్‌లో 'నో ఏసీ' ర‌గ‌డ‌

టిప్ లేదా అద‌న‌పు ఛార్జీ ఇస్తేనే ఏసీ వేస్తామ‌ని, లేక‌పోతే గిట్టుబాటు కాద‌ని, ప్ర‌యాణికులే తమకు కీలకమని, తమ బాధ కూడా అర్థం చేసుకోవాలని క్యాబ్‌డ్రైవ‌ర్లు చెబుతున్నారు.

హైద‌రాబాద్ క్యాబ్స్‌లో నో ఏసీ ర‌గ‌డ‌
X

హైద‌రాబాద్‌లో మండే ఎండ‌ల్లో ఏసీ కారెక్కి చ‌ల్ల‌గా గ‌మ్య‌స్థానానికి చేరుకుందామ‌ని క్యాబ్ ఎక్కుతున్న ప్యాసింజ‌ర్ల‌కు మండిప‌డే ప‌రిస్థితి వ‌స్తోంది. 'నో ఏసీ క్యాంపైన్' పేరిట క్యాబ్ డ్రైవ‌ర్లు ఎక్స్‌ట్రా డ‌బ్బులిస్తామంటేనే ఏసీ వేస్తామ‌ని చెబుతుండ‌టంతో ప్ర‌యాణికులు మండిప‌డుతున్నారు. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో కొంద‌రు అద‌న‌పు డ‌బ్బులిచ్చి ఏసీ వేయించుకుంటున్నారు. మ‌రికొంద‌రేమో క్యాబ్ అగ్రిగేట‌ర్ కంపెనీల‌కు కంప్ల‌యింట్ చేస్తున్నారు. మొత్తంగా హైద‌రాబాద్ క్యాబ్‌ల్లో రెండు రోజులుగా నో ఏసీ రగ‌డ పెద్ద దుమార‌మే రేపుతోంది.

రెండు రోజులుగా మంట‌లు

జంట నగరాల్లో ప్రధాన కంపెనీలైన ఓలా, ఉబర్, రాపిడో అగ్రిగేటర్ సంస్థల తరఫున క్యాబ్ స‌ర్వీసులు నడుపుతున్న డ్రైవర్లు రెండు రోజులుగా ఈ 'నో ఏసీ క్యాంపైన్' నడిపిస్తున్నారు. ఏసీతో నడిపించాలంటే అగ్రిగేటర్ సంస్థలు చెల్లించే కమీషన్ సరిపోవడం లేదని తెలంగాణ గ్రిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ల యూనియన్ వాదిస్తోంది. కమీషన్లు పెంచాలని ఇప్పటికే వారి దృష్టికి తీసుకెళ్లామ‌ని చెప్పింది. లేదంటే కర్ణాటక మాదిరి క్యాబ్‌ల‌కు యూనిఫాం ధరలు అమలు చేయాలని వాదిస్తోంది.

ఇదీ డ్రైవ‌ర్ల డిమాండ్

టిప్ లేదా అద‌న‌పు ఛార్జీ ఇస్తేనే ఏసీ వేస్తామ‌ని, లేక‌పోతే గిట్టుబాటు కాద‌ని, ప్ర‌యాణికులే తమకు కీలకమని, తమ బాధ కూడా అర్థం చేసుకోవాలని క్యాబ్‌డ్రైవ‌ర్లు చెబుతున్నారు. త‌మ‌కు తక్కువ కమీషన్ ఇస్తుండ‌టంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

ఏసీ వేసేందుకు నిరాక‌రిస్తే యాక్ష‌న్

డ్రైవర్లు క్యాబ్‌లో ఏసీ వేసేందుకు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని అగ్రిగేటర్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ట్రిప్ ఛార్జీల్లో 25 శాతం కోతతోపాటు, అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తామ‌ని, వారంవారీ ఇచ్చే ఇన్సెంటివ్స్ పోతాయ‌ని చెబుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ రెంటల్స్‌ లేదా ఇంటర్‌సిటీ ట్రిప్పులు కోల్పోతారని హెచ్చ‌రిస్తున్నాయి.

ప్ర‌భుత్వం చొర‌వ చూపాలి

ఇప్పటికే పీక్ అవర్స్, ఇతర ఛార్జీల పేరుతో చాలా సంద‌ర్భాల్లో తక్కువ దూరానికి కూడా ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నామని ఏసీ సేవల పేరుతో అదనంగా ఎలా చెల్లిస్తామని ప్రయాణికులు మండిప‌డుతున్నారు. డ్రైవర్లతో వాదనకు దిగుతూ ఆయా కంపెనీలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఛార్జీలు గిట్టుబాటు కాకపోతే అగ్రిగేటర్ సంస్థలతో తేల్చుకోవాలని, తీరా క్యాబ్ ఎక్కాక ఏసీ వేయకపోతే ఎలా అని మండిప‌డుతున్నారు. కంపెనీలు హెచ్చ‌రించినా 'నో ఏసీ' క్యాంపెయిన్‌పై ముందుకే వెళ్తామని డ్రైవర్లు చెబుతున్నారు. ప్ర‌భుత్వ జోక్యం లేక‌పోవ‌డంతో క్యాబ్ డ్రైవ‌ర్లు, అగ్రిగేట‌ర్ల మ‌ధ్య ఏ చిన్న త‌గ‌వు వ‌చ్చినా ప్ర‌యాణికుల‌ను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై ప్ర‌భుత్వ ప‌రంగా ఓ కార్యాచ‌ర‌ణ ఉంటేనే త‌ర‌చూ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

First Published:  10 April 2024 11:08 AM IST
Next Story